
స్పటికార, లోహద్రవి, సుభగ అని సంస్క ృతంలో పిలిచే పటికను ఇంగ్లీషులో Alum, Alumen అని పిలుస్తారు. ఇది ఒక ఖనిజ పదార్ధము. మార్కెట్ లో దొరుకుతుంది. నేపాల్ దేశంలోని గనుల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ పటికను గనులనుండి తీసి మలినపదార్ధములను వేరుచేసి వినియోగించాలి. పటికను ఔషధాలలోను, బట్టలకు రంగులు వేయడానికి ఉపయోగిస్తారు. ఈ పటికకు కఠిన లోహములను స్వచ్ఛముగా ద్రవింపచేసే శక్తి ఉంటుంది. శంఖ ద్రావకము, క్షారద్రావకము మొదలైన ఔషధాల్లో పటికను చేరుస్తారు.
పటికలో రెండు రకాలు ఉంటాయి. పటిక, ఫుల్లిక
పటిక బరువుగాను, నునుపుగాను ఉంటుంది. కొంచెం పసుపురంగడుగా ఉంటుంది. ఫుల్లిక తెలుపురంగులో ఉండి తేలికగా ఉంటుంది. నలుపు రంగులో కూడా ఉంటుంది. కానీ ఇది దొరకటం కష్టం.
పటిక గుణములు
ప్రధాన రుచి వగరు. పులుపు, కారమును అనురసములు. వేడిచేసే స్వభావము కలది. తీక్ష్ణ, రూక్ష గుణవిశిష్టము. విపాకమున కారపురుచిగా మారుతుంది. వ్రణశోధనమునకు మిక్కిలి ఉపయోగకము. ప్రధానంగా విషములను హరించడంలో పటికను మించిన ద్రవ్యం లేదు. కుష్ఠురోగమునకు దీని ప్రయోగము ఎక్కువగా ఉంటుంది. బొల్లి వ్యాధిని హరింపచేస్తుంది. నేత్ర రోగములను హరిస్తుంది. మూత్రకారి. తలవెంట్రుకలను నల్లబరుస్తుంది.
పటిక శుద్ధి ఎలా చేయాలి?
పటికను మూకుడులో వేసి నిప్పులమీద పెట్టినట్లయితే కరిగి పొంగును. నీరు ఇగిరి బిళ్ళ కట్టే వరకూ పొంగించాలి.
పటిక భస్మము
వెన్నతో నూరి లఘుపుఠము పెట్టినట్లయితే పటిక భస్మము తయారవుతుంది.
పటికతో ఔషధములు
తెల్లకుసుమలకు : పొంగించిన పటికిచూర్ణము అణా ఎత్తు మంచి గంధపు కషాయముతో సేవిస్తూ ఉన్నట్లయితే తెల్లకుసుమలు కట్టును. వెన్నతో కూడా సేవించవచ్చును.
ప్రదరములకు: త్రిక్షారభస్మము, పటిక, వెలిగారము, సూరేకారమును సమభాగములుగా కలిపి నూరి, పొంగించి తంగేడుపువ్వు, చందనము, తెల్లకలువ, మామిడిపువ్వు లేక లేత చిగుళ్ళు కషాయముతో ఇచ్చినట్లయితే శ్వేతప్రదరములు, తెల్లశెగలు కట్టును. పై వస్తువులు ఒక్కొక్కటి గాని, రోగబలమును బట్టి అన్నింటినీ గాని చేర్చి కషాయము పెట్టవలెను.
కంటి జబ్బులకు : ఒక ఔన్సు పన్నీరులో 10 గ్రాముల పటికచూర్ణమును కలిపి వడకట్టి కంటిలో వేయుచుండిన కలకలు, మంటలు, దురదలు మొదలగు కంటి వ్యాధులు తగ్గుతాయని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో వివరించడం జరిగింది. వాననీటిలో కూడా కలిపి వేయుదురు.
నోటిపూతలు, పంటి నలుపులకు
పటిక, త్రిఫలచూర్ణముగాని, పటిక, కవిరి, మాఫలకాయ చూర్ణము గాని కషాయము పెట్టి పుక్కిట పట్టినట్లయితే నోటిపూతలు, పంటి బాధలు శమించును. తుమ్మచెక్క కషాయములో పటిక చూర్ణము కలిపి పుక్కిలించినట్లయితే నోటి బాధలు శమించును. పటిక,త్రిఫల చూర్ణము కలిపి పళ్ళు తోమిన దంతవ్యాధులు శమించును.
రక్తప్రదరములకు
ఈతవేర్లు పాలతో కషాయము పెట్టి పటిక చూర్ణమును కలిపి సేవించినట్లయితే రక్తప్రదరములు కట్టును. చప్పిడి పథ్యము.
వాంతులకు
మామిడి చిగురు రసములో వెలగవేరు అరగదీసి అందులో రెండు గ్రెయినుల పటిక చూర్ణమును కలిపి కొంచెం తేనె చేర్చి సేవించినట్లయితే వాంతులు కట్టును.
పచ్చసెగలకు
పటిక,తోక మిరియాలు, మంచి గంధము, గులాబి మొగ్గలు కషాయము పెట్టి, సూరేకారము ఒక ఔన్సు కషాయమునకు 8 గ్రైనులు కలిపి సేవించినట్లయితే సెగలు కట్టును.
వ్రణములను కడుగుటకు
పట్టిక, త్రిఫలముల పెచ్చులు, చితక్కొట్టిన పసుపుకొమ్ములు కషాయము పెట్టి వ్రణములు కడిగిన శోధించి మాన్పును.
నీటిని స్వచ్ఛం చేస్తుంది
మడ్డిగా ఉన్న నీటిలో పటిక చూర్ణము కలిపి త్రిప్పినట్లయితే నీరు స్వచ్ఛమగును.
పటికతో ఇతర ఔషధములు
స్త్రీల ప్రదరములకు ఉపయోగకారి. జీర్ణించిన అతిసారములను పోగొడుతుంది. 10 గ్రెయిన్ల పటిక, ఐదు గ్రెయిన్ల నల్లమందు, ఒకటిన్నర ఔన్సుల యాకోరస్ రూటు కలిపి రోజుకు 3 సార్లు ఇచ్చినట్లయితే జీర్ణాతిసారములు కట్టును. 10 గ్రెయిన్లపటికను తరచూ తేనెతో ఇచ్చుచుండిన వాంతులు కట్టును. ఆస్తమా కు పది గ్రెయిన్లు వాడవలెను. చిన్నపిల్లలకు విషము వలన మత్తుకలిగినట్లయితే పటిక ప్రయోగించిన విషము విరిగి మత్తుతగ్గును.
కోరింతదగ్గులకు
పటిక రెండు నుంచి నాలుగు గ్రెయిన్లు ఒక చెంచా వామువాటర్ తో కలిపి రోజుకు మూడు సార్లుఇచ్చినట్లయితే కోరింతదగ్గు తగ్గుతుంది.
ఆస్తమాకు
ఐదుగ్రెయిన్ల పటిక చూర్ణము అర ఔన్సు పన్నీరులో కలిపి రోజుకు రెండుసార్లు ఇవ్వవలెను.
పాముకాటుకు
72 గ్రెయిన్ల పటిక చూర్ణము, నీటిలో కలిపి త్రాగినట్లయితే పాము విషము శమిస్తుందని వస్తుగుణప్రకాశిక వివరిస్తోంది. తర్వాత మజ్జిగ త్రాగవచ్చును.
గాయములు తగిలినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, బ్రెయిన్ చెడినప్పుడు 5 గ్రెయిన్ల పటిక పంచదార పానకముతో ఇచ్చినట్లయితే శమించును.
కంఠ రోగములు
ఒక టీస్పూను పౌడరు తేనెతో కలిపి ఇచ్చిన కంఠరోగములు శమించును. ఎక్కిళ్ళకును, వాంతులకు కూడా ఈ మందు వాడవచ్చును.
కొన్నిప్రదరములకు
5 గ్రెయిన్ల పటిక చూర్ణము అడ్డసరపు రసముతో రోజుకు మూడుసార్లు చొప్పున ఇచ్చిన రక్త ప్రదరములు ఆశ్చర్యకరముగా పోవును.
రక్త మూలములకు
4 గ్రాముల పటిక చూర్ణము ఒక పైస్టుపాలలో గిద్దెడు పాలతో కలిపి కాచి అర మొదలు రెండు ఔన్సుల వరకూ రోజుకు మూడుసార్లు ఇవ్వవలెను.
