నువ్వులపప్పును గానుగలో ఆడినప్పుడు నూనె తీయగా వచ్చిన అచ్చునే తెలగపిండి అని వ్యవహరిస్తారు. ఈ పిండి వగరును, చేదును కూడా కలిగి ఉంటుంది. చూడటానికి నల్లగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఎరువులకు, పశువుల దాణాకు ఉపయోగిస్తారు. తెల్లని నూపప్పు నుండి తీసినది తెల్లగా ఉంటుంది. ఇది కూరలు, పొడి, వడియాలు తయారు చేయడానికి వాడతారు. కూరలకు ఈ నువ్వుల పిండి ఎంతో శ్రేష్టం.
గుణములు
ఈ నువ్వుల తెలగపిండి విపాకములో తియ్యగా మారుతుంది. వాత, శ్లేష్మ హరమైనది. స్త్రీలలో చనుబాల వృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే బాలింతలకు ఎక్కువగా తెలగపిండి వినియోగిస్తారు. ఆస్థమా రోగులకు కూడా ఇది హితకరము. శరీరానికి పట్టిన నీరు తగ్గిస్తుంది. పుష్టిని, బలమును కలిగిస్తుంది. రక్తగడ్డలను మెత్తపరచి చిదుపుతుంది.
ఉబ్బురోగములకు
గొబ్బికూరలో తెలగపిండి వేసి ఆవిరిమీద ఉడికించి కూరగా తయారుచేసి తిన్నట్లయితే ఉబ్బువ్యాధి తగ్గుతుంది. మరియు ములగకూరతో తెలగపిండి కలిపి వండి తింటే కూడా ఉబ్బురోగములు తగ్గుతాయి.
స్తన్యవృద్ధికి
బొబ్బాసికాయలు సన్నంగా తరిగి అందులో తెలగపిండి వేసి కూరను తయారుచేసి బాలింతలకు పెట్టినట్లయితే స్తన్యము వృద్ధి అవుతుంది.
బాలింతలకు
తెలగపిండి, మినపప్పు కలిపి కూరను తయారుచేసి అందులో వెల్లుల్లిపాయలను, ఇంగువ కూడా తాలింపు పెట్టి ఆ కూర అన్నంలో వేసుకుని ఇంగువవేసి కాచిన నూనెను కూడా వేసుకుని తింటే మిక్కిలి వేడి చేసి, వాత దోషమును కూడా హరించును. మంచి రుచిగా ఉంటుంది. అన్నహితవును కలిగిస్తుంది. తెలగపిండి, మెంతులు, అనపప్పప్పు, కందిపప్పు, ఆనబకాయలోను, పొట్లకాయలోను కూడా వేసి వండి కూరగా ఉపయోగిస్తారు. ఇది మాత్రం బాలింతలకు పనికిరాదు.
తెలగపిండి పొడి
తెలగపిండిని, మిరపకాయలు, వెల్లుల్లి లేదా నీరుల్లి చేర్చి చేసిన పొడినే తెలగపిండి పొడి అంటారు. ఇది మంచి రుచిగా ఉంటుంది. పైత్యము చేస్తుంది. అజీర్ణకారి. బాలింతలకు వెల్లుల్లివేసిన పొడినే వాడాలి. నీరుల్లి పనికిరాదు.
గడ్డలకు
తెలగపిండి గాంధారిదుంప రసముతో కలిపి రక్తగడ్డలపై వేసి కట్టిన గడ్డ మెత్తబడి చితికి మానుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథములో వ్రాయబడింది.
మేహ వాత నొప్పులకు
తెలగపిండి, చోడిపిండి చాగమట్టల రసముతో కలిపి ఉడికించి పట్టువేసినట్లయితే నొప్పులు, వాపులు తగ్గుతాయి.