
పనస, కంటకఫల, అపుష్ప, బృహత్ఫల, స్కాండఫల అనేవి దీనికి పేర్లు. ఒక పెద్ద వృక్షజాతిలోనిది. హిందూ దేశము అంతా పెరుగుతుంది. ఆకులు, కాయ, పండు, మ్రాను, వేర్లు, పాలు కూడా ఉపయోగకారులై ఉంటాయి. ఆకులు విడివిడిగా ఉంటాయి. ఒంటరి చేరిక తొడిమ ఉంటుంది. రెమ్మలు, మ్రాను కణుపులు కలిగి ఉంటుంది. ఆకు బిరుసుగా ఉంటుంది. ఆకు కొంచెం పసుపు, ఆకుపచ్చ రెండు రంగులు కలిసి ఉంటుంది. ఆకు పండి రాలితే ఎర్రగా ఉంటుంది. చిగురు తెంపినా, మానుకు గంటు పెట్టినా పాలలాంటి పదార్ధం స్రవిస్తుంది. కాయపైన కూడా జిగురుగల పాలు ఉంటాయి. పనస చెట్టు పువ్వు మ్రానుపైన, చిన్న కొమ్మల పైన పుడుతుంది. పువ్వు ఏకలింగాకారము కలిగి ఉంటుంది. పువ్వులలో మగపువ్వులు కూడా ఉంటాయి. మిక్కిలి చిన్నవిగా ఉంటాయి. పువ్వుకు రెండు రేకలు మాత్రమే ఉంటాయి. సువాసన గాని, రంగుగాని ఉండదు. కింజల్క ఒక్కటే ఉంటుంది. పుప్పొడియొక్క కొనలలో రెండు గదులు కలిగి ఉంటుంది. పుష్పము యొక్క మూతి సన్నముగాను, గొట్టమువలే ఉంటుంది. పండు, ఏకపుష్ప సంజనితము కాదు. కాడపై ఉన్న పుష్పసముదాయము వల్లనే కాయ లేక పండు ఏర్పడుతోంది. కాయ గదులు కలిగి, చిన్న చిన్న బొడిపెలుగల ముడ్లతో ఉంటుంది.
జాతులు
పనసలో రెండు రకాలు ఉంటాయి. కూర పనస, పండు పనస. పండులో రెండు రకములు ఉన్నాయి. పీచు తొనలు కలిగినది. పెలుసు తొనలు కలిగినది. పెలుసు తొన శ్రేష్ఠమైనది, పీచు తొన మంచిది కాదు. కొన్ని పెళుసు తొనలలో తేనె ఉంటుంది. దాన్ని తేనె పనస అంటారు.
ఉపయోగాలు
ఆకులు విస్తర్లు కుడతారు. మ్రాని కఱ్ఱతో బీరువాలు మొదలగు గృహోపకరణ సామాగ్రి తయారు చేస్తారు. పచ్చికాయ కూరలకు ఉపయోగిస్తారు. పండులోపలి తొనలు తింటారు. గింజలు ఆటవికులకు ఆహారము. గింజలు కాల్చుకుని, కూరవండుకుని తింటారు. వేరు ఔషధాల్లో ఉపయోగిస్తారు.
గుణములు
కాయ వగరు, పండు తీపి రుచి కలిగి ఉంటుంది. శీతవీర్యము కలది. కాయకూర త్రిదోషకారి, శ్లేష్మమును పెంచును. రక్తపిత్తములను కలిగించును. పండు బలకరమైనది. వీర్యవృద్ధి, పుష్ఠి, తుష్ఠి కలిగిస్తుంది. అజీర్ణకారి, విదాహకారి. రోగులకు అపథ్యకారి, గింజలు కమ్మని రుచి కలిగి ఉంటాయి. పిండిపదార్ధం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకారి. పండు మూత్రకారి. పైత్య వాంతులను అరికట్టును.
చిన్నపనస
దీనినే కూరపనస అని కూడా పిలుస్తారు. పులుపు రుచిలో ఉంటుంది. కొంచెము తీపి కూడా మిశ్రమై ఉంటుంది. నేత్ర రోగములందు అపథ్యకారిగా ఉంటుంది.
వివరణము
పనస జాతిలో సదాపనస లేక వరు పనస అనే జాతి ఉంది. వేరునందే కాయ కాస్తుంది. కాయ కాచిన నేల పగులును. త్రవ్వి కాయను తీస్తారు. ఇది కూరకే ఉపయోగిస్తారు.
వేరు ఔషధాలు
- పనస వేరును బెల్లముతో కలిపి దంచి పాడి పశువులకు పెట్టినట్లయితే కుంభవృష్టిగా పాలిచ్చును.
- రుచికరమైన పండు. ఎక్కువగా తింటే అతిసారము కలుగుతుంది.
- బాగా పండిన రెండు తొనలు పరగడుపున తింటే మంచిగా పని చేయును.
- పనస చెట్టు పాలను ద్రాక్ష రసముతో కలిపి పట్టువేసినట్లయితే దెబ్బ, వాపులు మొదలైనవి తగ్గుతాయి.
- పండిన ఆకులను, వేరును నూరి రాసినట్లయితే చర్మవ్యాధులకు బాగా పనిచేస్తుంది. దీన్ని కషాయముగా కూడా వాడవచ్చు.
- ఈ కషాయము తీసుకున్నట్లయితే అతిసారము కడుతుంది.
- ఆకులు పాము విషమునకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది.