చోళ్ళు లేదా రాగులు అని పిలిచే వీటిని నిత్యం వాడుతూనే ఉంటాం. చాలామంది రాగిజావ, రాగి ముద్ద మొదలైనవి తయారు చేసుకుని వినియోగిస్తుంటారు. ఈ చోళ్ళు లేదా రాగులలో మెట్ట చోళ్ళు, పల్లపు చోళ్ళు అనే రకాలు ఉంటాయి. పల్లపు చోడి కంటె మెరక చోడి శ్రేష్ఠమైనది. ఇవి మళ్ళలోను, మెరక భూములలోను పండుతాయి. నల్లరంగు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఇంచుమించు ఈ మొక్క గజం ఎత్తు వరకూ పెరుగుతుంది. కాండము నుండి గింజలు కలిగిన వెన్ను ఉండి నాలుగు నుంచి ఆరు రేకలు ఉంటుంది. వెన్ను ముదిరిన తరువాత గింజలు ఎర్రగా కాని, నల్లగా కాని రకాన్ని బట్టి మారతాయి. సాధారణముగా ఎక్కువగా కష్టము చేసేవారు దీనినే ఆహారముగా తీసుకునేవారు. గడ్డిని పశువులు తింటాయి. కానీ ఈ గడ్డి వేడి. పాడి పశువులు తిన్నట్లయితే పాలు తగ్గుతాయి.
చోళ్ళు గుణములు
- ఈ చోళ్ళు కమ్మదనము, వగరు కలిసిన రుచితో ఉంటాయి. ఆకలిని అణుస్తుంది. దప్పిని శమింపచేస్తుంది. శ్లేష్మకరము. మూత్రమును చేస్తుంది. మేహ శామము కలిగిస్తుంది. మిక్కిలి వేడిచేసే తత్వము ఉన్నవారికి ఈ చోళ్ళు ఉపయోగకరము. కొన్ని తత్వములకు మలబద్ధకము కలిగిస్తాయి. కొన్ని తత్వములకు మలబద్ధకము తొలగిస్తాయి. అతి మూత్రమును హరిస్తుంది.
- చోళ్ళు నానబోసి, ఆరబెట్టి దోరగా వేయించి మెత్తగా పిండి చేసి ఆ పిండి పాలలో కలుపుకుని తాగినా, జావకాచుకుని తాగినా అతిమూత్రము, శుక్రనష్టము, శగలు కడతాయని వస్తుగుణప్రకాశిక గ్రంథములో పేర్కొనబడింది.
- చోడి అంబలి మజ్జిగలో కలిపి తాగడం వల్ల మేహశాంతి చేస్తుంది. మూత్రబంధమును విప్పుతుంది.
- చోడిపిండి చిట్టినారమట్టల రసముతో గాని, అంతర తామరాకు నీటితో గాని ఉడికించి పైన పట్టు వేసినట్లయితే ఎటువంటి దెబ్బలైనను, వాపులైనను శమిస్తాయి.
- చోడిపిండితో తలరుద్దుకున్నా, చోళ్ళు నల్లగా మాడ్చి ఆ మసి మంచి నూనెలో కలిపి కాచి తలకు రాసుకున్నా వెంట్రుకలు నల్లబడతాయి.