కొబ్బరి జాతులలో ఒక గొప్పరకము గంగా బొండము. ఈ రకం కొబ్బరి చెట్టు ఎక్కువగా కోనసీమ ప్రాంతంలో ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ప్రతీ ఇంటివారు తప్పనిసరిగా కొబ్బరినీళ్ళకోసం తమ పెరట్లో పెంచుకుంటారు. అయితే ఈ కాయలు కేవలం నీళ్ళ కొరకే పెంచుతారు. అంటే కాయలు ముదిరాయంటే చెట్టు చెడిపోతుంది. కాపు కూడా తగ్గిపోతుంది. ముదిరితే కాయలోని నీళ్ళు కూడా రుచి తగ్గి గుణము చెడిపోతుంది. కావున కాయలు లేతవిగా ఉండగానే చెట్టునుండి తీసివేయాలి. మామూలు కొబ్బరికాయలలో కంటే, ఈ కాయలలో నీరు ఎక్కువ రుచిగా ఉంటుంది. వేసవి కాలములో దీని ఉపయోగం ఎక్కువ.
గంగా బొండము గుణములు
గంగా బొండంలో నీరు చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిని పుట్టిస్తుంది. చలువ చేస్తుంది. దప్పిక, తాపము తగ్గిస్తుంది. పిత్తము, వాతము పోగొడుతుంది. బలము, పుష్టి, వీర్యవృద్ధి కలిగిస్తుంది. మేహము కల వారికి చాలా ఆప్యాయసనముగా ఉంటుంది. కాని దగ్గు, వగర్పు (ఉబ్బసము)కలిగిన వారికి మాత్రం ఈనీటిని సేవించకూడదు.
ఆకాశంలో వెన్నెల వ్యాపించినట్లు దీని పెంకులకు మీగడ వంటి పల్చని కొబ్బరి పొరగా అంటి ఉంటుంది. చాలా మృదువుగాను, వెన్నెల ముద్ద చేసినట్లు ఉంటుంది. ప్రత్యేకంగా కాని, పంచదార, బెల్లం కాని కలుపుకుని ఈ కొబ్బరి పొరను తిన్నట్లయితే ఎంతో రుచికంగా ఉంటుంది. పుష్టి, బలము కలిగిస్తుంది. నీళ్ళు చేసిన అన్ని గుణములను ఈకొబ్బరి కూడా కలిగి ఉంటుంది. విశేషించి వీర్యవృద్ధి కలిగించి శరీరమునకు కాంతి, నునుపు, వర్ఛస్సు కలిగిస్తుంది.