గుల్కందు సువాసన కలిగి తియ్యగా ఉంటుంది. కొంచెం వగరు రుచి కూడా కలిగి ఉంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతుంది. గులాబీపూవు రేకులను మూతి వెడల్పు కలిగిన సీసాలో వేసి దానిపైన మెత్తని పంచదార చల్లి ఎండలో పెట్టాలి. మర్నాడు మళ్ళీ రేకులను, పంచదార చల్లి ఎండలో పెట్టాలి. ఇలా పదిరోజులు పాటు ప్రతిరోజూ కొన్ని గులాబీరేకులు, కొంచెం పంచదార వేస్తూ ఎండలో పెడుతూ ఉండాలి. ఇలా పదిరోజులపాటు చేస్తూ ఉంటే అది ముద్దలా తయారవుతుంది. ఇది ఒకరకం పద్ధతి.
మరో పద్ధతిలో గులాబీపువ్వు రేకులను కొంచెం ఆరనివ్వాలి. పంచదార లేతపాకము పట్టి, స్టవ్ ఆఫ్ చేసి అందులో ఈ ఆరిన గులాబీ రేకులను వేసి మూతపెట్టి ఉంచినట్లయితే ముద్దకడుతుంది. ఇది సులభమార్గము. ఇలాగే తేనెతో కూడా చేయుదురు.
గుల్కందు గుణములు
- మలబద్ధమును పోగొట్టి సుఖ విరేచనము అవుతుంది.
- అన్ని విధాలైన మేహ పైత్యములు హరిస్తుంది.
- ధాతువృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
- శుక్లనష్టము కట్టి శరీరంలో వేడి తగ్గిస్తుంది.
- అరుచిని పోగొడుతుంది.
- శగరోగాలను తగ్గిస్తుంది.
- కళ్ళకు మేలుచేస్తుంది.
- వేడితత్వము కలిగినవారు అభ్రకము, మకరధ్వజము, రజితచంద్రోదయము తదితర మందులు సేవించునప్పుడు ఈ గుల్కండ్ ను అనుపానముగా తిన్నచో శరీరానికి వేడిచేయకుండా ఉంటుంది.