అశోకచెట్టు : అశోకః అని సంస్కృతంలో పిలిచే అశోక వృక్షములో రెండు జాతులు ఉన్నాయి. అశోక శాస్త్రీయనామం Saraca Indica Jonesia Asoca. ఈ చెట్టుఆకులు రామాఫల చెట్టు ఆకులను పోలి ఉంటాయి. నారింజపండు రంగు పువ్వులు కలిగినది ఒకటి, తెలుపు రంగు పువ్వులు కలిగినది ఒకటి ఉంటాయి. మాఘ ఫాల్గుణ మాసములలో దీని పూత ఆరంభం అవుతుంది. వైశాఖమాసములో పండ్లు పండుతాయి. ముదురు కాయలు నీలపు రంగు కలిగి ఉంటాయి. బాగా పండినట్లయితే ఎర్రనిరంగులోకి మారతాయి. పళ్ళు తినడానికి బాగుండవు. పండులో గింజలు ఉంటాయి. చిగురు ఎర్రగా ఉంటుంది. పువ్వులో తేనె ఉంటుంది.
అశోక చెట్టుగుణములు
అశోకములో వగరు, చేదు, తీపి అని రుచులు కలగలిసి ఉంటాయి. చలువ చేస్తుంది. చెట్టు బెరడే మందులకు మిక్కిలి ఉపయోగము. గుండెకు చాలా మంది మందు. పైత్యమును, తాపమును, శ్రమను పోగొట్టును. సర్వ వ్రణములను నశింపచేయును. గుల్మములు, శూలలు, కడుపుబ్బులను హరించును. విషములను హరించును. స్త్రీల ప్రదర రోగములకు ఇది పెట్టిందిపేరు.
ఎర్రకుసుమలకు
అశోకపట్ట మెత్తగా చితక్కొట్టి నీటిలో వేసి కషాయము కాచి పూటకు ఒక ఔన్సు కషాయము, ఔన్సు పాలు కలిపి సేవించినట్లయితే కుసుమలు కట్టునని చక్రదత్త అనే ఆయుర్వేద గ్రంథములో వివరించారు. కాయలోని గింజలు నీళ్ళతో నూరి త్రాగినట్లయితే మూత్రాఘాతములు, మూత్రాశ్మరులు నశించును. ఋతుచక్రములు క్రమపద్ధతిలో రావాలంటే ఈ కషాయము మిక్కిలి శ్రేష్టం. బెరడుతో అశోకారిష్టము, అశోక ఘృతము అనే మహత్తరమైన ఔషధములు తయారు చేస్తారు. ఈ చెట్టువిషయములో ఒక పురాణకథ ప్రకారము ఔవనవతులైన స్త్రీలు ఈ చెట్టును కాళ్ళతో తన్నితే తక్షణమే పూత పూస్తుందని ఉంది. మొత్తానికి ఈ చెట్టు స్త్రీలపాలిటి కల్పవృక్షము.