అంబాళపు చెట్టు: ఆమ్రాతక అని సంస్కృతంలో పేరు కలిగిన అంబాళపు చెట్టు శాస్త్రీయనామం Spondias Mangifera . ఇంగ్లీషులో దీన్ని Hogoplum Wild Mango అని పిలుస్తారు. ఇది ఫలజాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు అడవుల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ చెట్టును తోటలుగా కూడా పెంచుతారు. జంటజంటగా రెండేసి కాయలు చొప్పున కాస్తాయి. ఈ పళ్ళను కోతులు ఎక్కువగా తింటాయి. కాయనిండా రసం ఉంటుంది. ఈ పళ్ళు వర్షాకాలంలో కాస్తాయి. తీపి, పులుపు కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. చిగురాకు కూడా కొంచెం పుల్లగా ఉంటుంది.
అంబాళపు చెట్టు గుణములు
వేడిచేసే స్వభావం కలిగి ఉంటుంది. విపాకమున మధుర రసముగా మారుతుంది. అరుచి పోగొడుతుంది. గొంతుకను సవరించి స్వరమును బాగుచేస్తుంది. బాగా పండిన పండ్లు ధాతువృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తాయి. దోష రక్తమును హరించి క్షయను పోగొట్టును. వాత వికృతులను హరిస్తుంది. పచ్చికాయ మాత్రం శ్లేష్మ, పిత్తములను కలిగిస్తుంది.