ఇండుప గింజలు: కతక, అంబుప్రసాద అనే పేర్లు కలిగిన ఇండుపగింజలు చెట్టులో గింజలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. Strychnos Patator-Dum, Clearing Nuts Tree అని ఇంగ్లీషులోను పిలుస్తారు. ఈ ఇండుప చెట్టును చిల్ల చెట్టు అని, ఇండుప గింజలను చిల్ల గింజలని కూడా పిలుస్తారు. మన్యపు అడవులలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. బర్మాలో కూడా ఈ చెట్లు అధికంగా ఉంటాయి. బెంగాల్ రాష్ట్రంలోను, సౌత్ ఇండియా అంతటా ఈ చెట్లు కనిపిస్తాయి.
ఇండుప గుణములు
ఇండుప గింజలకు ముఖ్యంగా మడ్డిగా ఉన్న నీటిని శుభ్రపరిచే గుణము ఉంది. ఈ గింజలు అరగదీసి ఆ గంధము నీటిలో కలిపినట్లయితే ఎటువంటి మడ్డి నీరైనా తేటగా మారుతుంది. మట్టి కిందకు పోతుంది. గింజలు తెల్లగా గుండ్రంగా ఉంటాయి. మిక్కిలి జిగురు కలిగి ఉంటాయి. దీని చెట్టు వృక్షజాతుల లోనిది. చలువ చేసే గుణము కలిగి ఉంటుంది. విషములను హరిస్తుంది. దాహాన్ని అణుస్తుంది. అన్ని రకాల నేత్ర రోగములను పోగొడుతుంది. పండు చేదుగా ఉంటుంది. పైత్యము చేస్తుంది. మూత్రకోశములో ఉన్న శర్కరలను రాళ్ళను కరిగిస్తుంది. క్రిమి దోషములను హరిస్తుంది. శూలలను కూడా పోగొడుతుంది. వాత శ్లేష్మములను రెండింటినీ పోగొడుతుంది. మొత్తానికి ఇది మధుర రసముగా పేర్కొన్నారు ఋషులు. వాంతిని చేస్తుంది. చెమటను పట్టిస్తుంది. ఉబ్బు, పాండురోగములను శమింపచేస్తుంది.
ఇండుపతో ఔషధములు
అశ్మరీ రోగమునకు
ఇండుపచెట్టు వేరు కషాయము రెండు చెంచాల వంతున లోనికి ఇస్తున్నట్లయితే అశ్మరులు తగ్గుతాయి.
నేత్ర రోగములు
ఇండుగ గింజల గంధములో కొంచెం సైంధవ లవణం కలిపి కంటికి కాటుకలా ధరిస్తే అర్జున తదితర నేత్రరోగములు హరిస్తాయి. ఇండుపగింజలను తేనెతో అరగదీసి నేత్రములకు కాటుక పెట్టినట్లయితే కళ్ళు బహు నిర్మలంగా ఉంటాయి. దీనిలో కొంచెం పచ్చకర్పూరం కూడా కలపాలి. ఇండుప గింజల చూర్ణమును పాలతో కలిపి త్రాగినట్లయితే వీర్యనష్టము కట్టడమే కాకుండా వీర్య వృద్ధికరము. ఇండుప గింజలతో కూర వండుకోవడం, ఊరగాయ కూడా పెట్టుకుంటారు.