ఆకాశ గరుడి అనే పేరు కలిగిన ఈ మొక్క తీగజాతిలోనిది. దీనినే ఇంగ్లీషులో Bryonia Epigoea అని పిలుస్తారు. సాధారణ వాడుక భాషలో రాకాసితీగ, మురుదొండ, నాగదొండ అని కూడా పిలుస్తారు. ఈ తీగకు గబ్బువాసన కలిగిన ఎర్రటి పండ్లు కాస్తాయి. ఆకులు ముడుచుకుని ఉండి మందంగా ఉంటాయి. పువ్వులు పసుపురంగులో ఉంటాయి. దుంప కూడా ఉంటుంది. ఎక్కువ చేదు, కొంచెం పులుపు రుచి కలిగి ఉంటుంది. ఆకాశములో గరుడపక్షి ఎలా ఉంటుందో అలాగే ఈ తీగ జీవిస్తుంది అందుకే గరుడి అనే పేరు వచ్చింది.
ఆకాశగరుడి గుణములు
సవాయి వ్యాధులకు ఇది ముఖ్యమైనమూలిక. క్రిములను చంపి విరేచనము చేస్తుంది. పాము విషములకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. ప్రతీ జంతువు యొక్కవిషమునకు దీని దుంపను మాత్రమే ఉపయోగించాలి. మనిషి మూత్రముతో దీని దుంప నూరి పావలాయెత్తు చొప్పున లోనికి ఇచ్చిన విషము శమించును. ఈ దుంప గంధము పసుపుతో కలిపి లోనికిచ్చినను, పైకి రాసినా విషము శమించును. తేలు కుట్టినచోట ఈ గంధమురాసి గుడ్డ కాల్చి పొగ వేసినట్లయితే తేలు విషము హరిస్తుంది. పశువులు పాలివ్వకుండా తన్నివేస్తున్నట్లయితే ఆకాశగరుడి పసరు చన్నుకట్టుమీద రాసినట్లయితే కుదుటపడి పాలిస్తాయి. దీని పసరుతో తగరము భస్మమవుతుంది.