కుందురు అని సంస్కృతంలో పిలిచే అందుగు చెట్టు శాస్త్రీయనామం Boswellia Serrata. ఇంగ్లీషులో Indian Olibanum అని పిలుస్తారు. దీనిని శల్లకి అని కూడా పిలుస్తారు. పెద్ద వృక్షజాతిలోనిది. ఆకులు ఇంచుమించు పెద్దమానుచెట్టు ఆకులను పోలి ఉంటాయి. మ్రాను, కొమ్మలు తెల్లగా ఉంటాయి. పాలుగల చెట్టు. చెట్టుకు గంటు పెట్టినా, చిగురు చిదిమినా పాలు కారుతాయి. ఈ పాలకు ఒక విధమైన సువాసన ఉంటుంది. తెల్లని పూలు పూసి, పండ్లు పండుతాయి. ఈ చెట్టు నుండి వెలువడిన జిగురునకే ఫిరంగి సాంబ్రాణి అని పేరు.
అందుగు చెట్టు గుణములు
అందుకుచెట్టు నుంచి లభించే ఈ ఫిరంగి సాంబ్రాణికి చలువ చేసే స్వభావము ఉంటుంది. ప్రధానరసము వగరుగా ఉన్నా తీపి, చేదు రుచులు కూడా దీనిలో మిళితమై ఉంటాయి. విపాకమున తీపి రుచిగా మారుతుంది. అతిసారమును తగ్గిస్తుంది. శ్లేష్మపైత్యములను శమింపచేస్తుంది. రక్తపైత్య వ్యాధిని, వ్రణములను పోగొడుతుంది. బలమును ప్రసాదిస్తుంది. పువ్వు కఫ, వాతములను, మూలశంకలను, కుష్టులను, అరోచకమును హరిస్తుంది. పండునకు కూడా పుష్పముయొక్క గుణములే ఉంటాయి. పుల్లలు దంతధావనమునకు శ్రేష్టములు. అందుగు చెక్క కషాయముతో వ్రణములను(కురుపులను) కడిగినట్లయితే కురుపులు మానుతాయి. కషాయముతో పంచదార చేర్చి లోనికి తీసుకున్నట్లయితే రక్తపిత్తము శమిస్తుంది.