ఏడాకుల బెండ రకం లో మొక్కకు ఏడు ఆకులు తొడగగానే కాపుకు వస్తుంది. చెట్టు నార కలిగి ఉంటుంది. చెట్టు కంతటికినీ నూగు ఉంటుంది. కాయలు కోలగా ఆరు అంగుళాల వరకూ పెరుగుతాయి. కాయ నాలుగు భాగములుగా ఉంటుంది. ప్రతి భాగములోను గుండ్రటి విత్తనాలు ఉంటాయి. కాయ జిగురుగా ఉంటుంది.
బెండకాయ గుణములు:
- బెండకాయ తీపి రుచి కలిగినది.
- పైత్యమును హరిస్తుంది. వాత కఫములను చేస్తుంది.
- వీర్యమును వృద్ధిచేస్తుంది.
- పుష్టికరమైనది, రుచికరమైనది. కాయగూరలలో ఇంత బలమైన ఆహారము మరొకటి లేదు.
- జీర్ణశక్తి బాగా ఉన్నవారు మాత్రమే ఈ బెండకాయను తినాలి.
- వాతరోగులకు, శ్లేష్మ శరీరం ఉన్నవారికి ఈ బెండకాయ పనికిరాదు.
- బెండకాయకు మలబద్ధకము చేసే గుణము ఉంది.
- బెండకాయకు జీలకర్ర, పుల్లమజ్జిగ విరుగుడుగా పనిచేస్తాయని వస్తుగుణ ప్రకాశిక అనే గ్రంథం తెలియచేస్తోంది.
బెండ మొక్కతో ఔషధములు
వీర్యవృద్ధికి
బెండచెట్టు వేరు చూర్ణమును పాలలో కలిపి తాగినట్లయితే వీర్యవృద్ధి, బలము కలుగుతాయి.
శుక్రనష్టము తగ్గుటకు
ఎండబెట్టిన బెండకాయల ఒరుగులను కషాయము పెట్టి తాగుతూ ఉన్నట్లయితే శుక్రనష్టమును అరికడుతుంది.
మూలశంఖ నివారణకు
లేత బెండకాయలను మజ్జిగలో ఉడకబెట్టి మజ్జిగ పులుసులాగ చేసుకుని తింటే మూలశంఖ, పిస్టులా వంటి రోగాలు తగ్గుముఖం పడతాయి.
వివిధరకాల వంటల్లో
బెండకాయలు అనేక రకాల కూరల్లో వినియోగిస్తారు. బెండకాయ-తెలగపిండి, బెండకాయ-నువ్వులపొడి, బెండకాయ పులుసు, మట్టుబచ్చలి బెండకాయ, వేపుడు తదితర రుచికరమైన వంటలు చేసుకుని తినవచ్చు.