చిత్రమూలముతో మూలవ్యాధులు మాయం

 

చిత్రక, అగ్ని అని సంస్కృతంలో పిలువబడే చిత్రమూలమును ఆంగ్లములో Plumbago Zeylanica అని పిలుస్తారు. ఎర్రని చిత్రమూలము- Plumbago Rosea. ఇది సుమారు రెండు గజముల ఎత్తు వరకూ పెరుగుతుంది. క్షుపజాతిలోనిది. కాండము నున్నగా ఉంటుంది. ఆకులు చిన్న తమలపాకులను పోలి, వాటికంటే కొంచెం గుండ్రంగా ఉంటాయి. ఆకులు విడివిడిగా ఉంటాయి. దీనికి ఉత్తరేణి మొక్కకు ఉన్న వెన్నుల్లాగా వెన్నులు ఉంటాయి. నక్కిరికాయలులాగ ఇవి బట్టలకు పట్టుకుంటాయి. వేరు పొడవుగా ఉండి చితక్కొట్టినట్లయితే పసుపు రంగులో ఉంటుంది. చిత్రమూలములో ఎరుపు, తెలుపు, పసుపు పచ్చరంగుల భేదముతో మూడు జాతులు ఉన్నాయి. పువ్వుల రంగును బట్టి, కాండమునకు ఉన్న స్వల్పమైన రంగును బట్టి రకాన్ని నిర్ణయించాలి. దీనిలో ఇతర అంగములకంటే వేరునకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. 

చిత్రమూలము గుణములు

వేరు మిక్కిలి కారపు రుచి కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగినది. విపాకమున కూడా కారపురుచియే కలిగి ఉంటుంది. వాత, కఫములను పోగొడుతుంది. వాతోదరమును, గ్రహణీరోగమును, మూలశంకలను నిర్మూలిస్తుంది. పాండురోగమును, క్షయను హరిస్తుంది. క్రిములను, దురదలను పోగొడుతుంది. ఎర్రచిత్రమూలమును, నల్లచిత్రమూలమునకు ఇంచుమించు ఒకేరకమైన విశేషగుణములు ఉన్నాయి. ఈ రెండూ కూడా రసమును బంధిస్తాయి. లోహస్వర్ణీకరణమునకు కూడా ఈ చిత్రమూలమును వినియోగిస్తారు. నల్లచిత్రమూలమునకు వెంట్రుకలను నల్లబరిచే గుణము ఉంది. పాలలో వేరు వేసినట్లయితే పాలు నల్లబడతాయి. మొత్తమునకు ఈ రెండు అమూల్యద్రవ్యములను రసాయన ద్రవ్యములు అనటానికి సందేహము లేదు. 

చిత్రమూలము  ఔషధములు

ఉబ్బులకు :

చిత్రమూలపు ఆకులు తరిగి కూరగా వండి పెట్టినట్లయితే ఉబ్బులు తగ్గుతాయి.

గ్రహణికి

చిత్రమూలము పెద్ద ములకల క్షారమును వారమురోజులు స్రవింపచేసి పిమ్మట దానిని దీని దానికి రెండు రెట్లు ఆవునేతితో కలిపి వాటిని ఘృతపాకముగా కాచి సేవించినట్లయితే జఠరదీప్తిని కలిగించి గ్రహణి రోగమును నివారిస్తుంది. 

మేదో రోగమునకు

చిత్రమూలము వేరు చూర్ణముతేనెతో సేవించి తనశరీరానికి పడిన ఆహారమునే భుజించినట్లయితే మేదోరోగములు హరిస్తాయి.

బోదకాలునకు

చిత్రమూలపు వేరు ముద్దగాని, దేవదారుగాని లేక రెండూ కాని లేపనముగా పూస్తే గుణకారిగా ఉంటుంది. 

రసాయనార్ధం

నలుపు, ఎరుపు రంగులుకల చిత్రమూలములలో దేనిదైనా వేరును తీసి నీడలో ఎండబెట్టి చూర్ణమును చేసి, ఆ చూర్ణమును నేతిలోగాని, నెయ్యి, తేనెకలిపి గాని, పాలతో కాని, నీళ్ళతోకాని ఒక నెలరోజులపాటు సేవిస్తూ హితకరమైన ఆహారమును భుజిస్తూ ఉన్నట్లయితే నిస్సంసయముగా నూరు సంవత్సరాలు జీవిస్తాడు. మంచినూనెతో కలిపి తీసుకున్నట్లయితే దుస్తరమైన వాతములు హరిస్తాయి.  గోమూత్రముతో కలిపి సేవించినట్లయితే కుష్ఠురోగములు, బొల్లి నివారణ అవుతుంది. మజ్జిగతో కలిపి తాగినట్లయితే మూలశంకలు మొదలైన మూల రోగములు హరిస్తాయి. 

మూలశంకలకు

చిత్రమూలము, శొంఠి కలిపి నీథుమద్యముతో పానము చేసినట్లయితే మూలశంకలు హరిస్తాయి. 

కఫకాసలకు

చిత్రమూలపు వేరును, తెల్లబాడిద వేరును, బెరడులను గ్రహించి నీళ్ళలో నూరి రసము తీసి, పొంగించి దానిలో తేనె కలిపి ఇచ్చినట్లయితే దారుణములైన కఫకాసలు శమిస్తాయి. చిత్రమూలపు వేరు పంటికి తాకించినట్లయితే పుండవుతుంది. చితకని వ్రణములకు గాని, గ్రంధులకు గాని చిత్రమూలమును పైన రాయుదురు. చిత్రమూలమును గర్భిణీలకు వాడకూడదు. గర్భస్రావములు కలిగిస్తుంది. పైన లేపనము చేయుటవలన పక్వముగాని వ్రణములు పక్వమగుటయు, పక్వవ్రణములు చితుకుటయు జరుగుతుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.