ఏడాకుల అరటి ( సప్తపర్ణ) అని సంస్కృతంలో పేరు కలిగిన ఏడాకుల అరటిని ఇంగ్లీషులో Alstonia Scholaris, A Olecandrifolia, Echites Scholaris అని పిలుస్తారు. అడవులలో పెరిగే ఈ వృక్షము చాలా ఔషధీయ గుణములు కలిగినది. ఈ చెట్టుకు ఒక రెమ్మకు ఏడాకులు ఉంటాయి. కాయలు చిన్న చిన్న నిమ్మకాయలంత ఉండి వంకరగా ఉంటాయి. సువాసన కలిగి ఉంటాయి. గుత్తులుగుత్తులుగా పూలు పూస్తాయి. శరదృతువులో ఈ పూలు పూస్తాయి. ఆకులు గొడుగు వలె ఉంటాయి. పువ్వులు పైకి కనపడవు. ఈ చెట్టు ఎక్కడఉంటుందో దానికి సుమారు పావు కిలోమీటరు దూరం వరకూ సువాసన వాయువులు ప్రసరిస్తాయి. ఈ వృక్షాల నీడలో మునులు భగవద్ధ్యానం చేసుకునేవారు.
ఏడాకుల అరటి గుణములు
ఏడాకుల అరటిలో సర్వాంగములు కూడా ఉపయుక్తములు. మూడు దోషములను శమింపచేస్తుంది. గుండెకు మిక్కిలి ప్రీతికరమైనది. రుచి చేదుగా ఉంటుంది. వేడిచేస్తుంది. మంచి జఠరదీప్తిని కలిగిస్తుంది. సుఖవిరేచనము చేస్తుంది. శూలలను హరిస్తుంది. గుల్మములను బోచేస్తుంది. క్రిములను పోగొడుతుంది. కుష్ఠురోగములను తగ్గిస్తుంది. రక్తరోగములను అన్నింటిని శమింపచేస్తుంది. ఎటువంటి వ్రణములను అయినా శోధించి మాన్పుతుంది. జీర్ణజ్వరములను హరిస్తుంది. శ్వాసరోగములు శమింపచేస్తుంది. అసాధ్య గ్రహణులను కూడా తగ్గిస్తుంది. ప్రవాహిక, వాతరక్తము పోగొడుతుంది. విపాకమున కారపురుచిగా మారుతుంది. ఏడాకుల చెట్టునకు గాటు పెట్టినట్లయితే పాలుకారుతాయి.
ఏడాకుల అరటి ఔషధములు
కుష్ఠురోగములను
ఏడాకుల అరటిమొక్క చెక్క, ఆకులు కషాయము పెట్టి స్నానమునకు, పానమునకు వినియోగించాలి. పైన కడగడానికి ఉపయోగించినట్లయితే కుష్ఠురోగముల నివర్తింపబడుతుంది.
సస్యశుద్ధికోసం
ఏడాకుల అరటి మ్రానుపట్ట, తిప్పతీగ, శొంఠి కలిపి, కషాయము పెట్టి ఆ కషాయము తాగినట్లయితే సస్యదోషము తగ్గుతుంది.
సాంద్రమేహమునకు
ఏడాకుల అరటి ఆకుల కషాయము సేవించినట్లయితే సాంద్రమేహము నివర్తిస్తుంది.
విషహరము
ఏడాకుల అరటి మ్రానిపట్ట కషాయము పెట్టి ఆ కషాయములో తేనె కలిపి దంతములకు, నోటికి రాసినట్లయితే విషము హరిస్తుంది.
దగ్గు, వగర్పు
సప్తపర్ణము పువ్వులను, పిప్పళ్ళను పెరుగుమీది నీటితో కలిపి తాగినట్లయితే శ్వాసకాసలు హరిస్తాయి.
ఎక్కిళ్ళకు, శ్వాసరోగములకు
ఏడాకుల అరటి మాను చెక్క రసములోతేనె, పిప్పలిచూర్ణము చేర్చి సేవించినట్లయితే ఎక్కిళ్ళు, శ్వాసకాసలు శమిస్తాయి.
పిప్పిపంటికి
ఏడాకుల అరటి ఆకులరసమును, జిల్లేడుపాలు కలిపి పిప్పిపంటిలో వేసినట్లయితే పురుగు చచ్చి బాధ ఉపశమిస్తుంది.
వ్రణములకు
ఏడాకుల అరటి ఆకులను మెత్తగా నూరి పైన పూసినట్లయితే దుష్టవ్రణములు మానుపడతాయి.
పట్టచూర్ణము 15గ్రెయిన్లుగాని, కషాయముగాని రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే జీర్ణించిన అజీర్ణములు, యాకృతువృద్ధి(ఎన్లార్జ్డ్ స్ల్పీన్) హరిస్తుంది.
ఏడాకుల అరటి పట్ట చూర్ణమును ఉదయము,సాయంత్రము స్వీకరించినట్లయితే జనరల్ టానిక్ లా పనిచేస్తుంది. సప్తపర్ణము కషాయము చాలాకాలంపాటు వాడటం వల్ల క్వినైన్ సల్ఫేటుతో సమానంగా పనిచేస్తుంది. గొప్ప గొప్ప వైద్యులు కూాడా తమ అనుభవంతో ఈ విషయాన్ని తెలియచేసారు. ప్రత్యేకంగా క్వినైన్ వాడినప్పుడు చెముడు, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సప్తపర్ణములో ఈ చెడు గుణములు పట్టవు.