లోహద్రావీ, టంకణ అని సంస్కృతంలో పేర్లు కలిగిన వెలిగారమును ఇంగ్లీషులో Borax అని పిలుస్తారు. ఇది కొంచెం ద్రవము కలిగి తెల్లగా ఉండే ఘనపదార్ధము. క్షారవర్గములో ఒకటి. పైకి చూడటానికి పటికలాగ ఉంటుంది. రుచిని బట్టి మాత్రమే ఆ వస్తువును గుర్తించాలి. మూకుడులో వేసి నిప్పులమీద పొంగించినట్లయితే వెలిగారము శుద్ధమవుతుంది.
వెలిగారము గుణములు
ఇది కారము, ఉప్పు కల రుచులు కలిగి ఉంటుంది. వేడి చేసే స్వభావం కలది. రూక్షగుణము కలిగినది. కటువిపాకి. లోహములను ద్రవింపచేసే గుణము దీనిలో ఉంది. కఫవాతములును హరిస్తుంది. శ్వాసకాసలను, గుల్మములను, జ్వరములను, స్థావరజంగమ విషములను హరిస్తుంది. శూల, అగ్నిమాంద్యము, మూత్రబద్ధములు, ఋతుబద్ధము, అతిసారము, వ్రణములు తదితర రోగములకు బాగా పనిచేస్తుంది.
వెలిగారము ఔషధములు
మూత్రబంధము విప్పుటకు
శుద్ధ వెలిగారము, సూర్యకారము, పటిక ఈ మూడూ కలిపి పొంగించినట్లయితే బిళ్ళకడుతుంది. ఈ బిళ్ళను మంచినీటిలో కలిపి తాగించినట్లయితే మూత్రబద్ధములు విడతాయి.
సుఖప్రసవమునకు
పచ్చి వెలిగారము నూరి నీళ్ళతో కలిపి త్రాగించినట్లయితే సుఖప్రసవము అవుతుంది.
కండ్లకలకలకు
పొంగించిన వెలిగారము, పన్నీరులో కలిపి 4 చుక్కలు కంటిలో వేసినట్లయితే ఎరుపు, దురద, పుసి మొదలైనవి తగ్గుతాయి. పన్నీటికి అణాఎత్తు చూర్ణమును కలిపి కంటిలో వేయాలి.
పిల్లల దగ్గులకు
వెలిగారమును 8 రోజులు తెల్లజిల్లేడు పాలతో భావన చేయవలెను. పిమ్మట ఇది బిళ్ళలా చేసి పుటము వేసినట్లయితే భస్మమవుతుంది. ఆ భస్మము మూడు లేక నాలుగు గురివిందగింజల ఎత్తు సేవిస్తూ ఉన్నట్లయితే అజీర్ణవిరేచనములు, దగ్గులు ఉపశమిస్తాయి. గ్రహణ్యతీసారములయందు పనిచేస్తుంది. కొన్ని ఔషధములలో వినియోగిస్తారు. కొన్ని కజ్జలీ ఔషధములలో వెలిగారము కలుపుతారు.