కుంకుమపువ్వుతో కలుగును మేలు

మంచు ప్రదేశాల్లో ఈ సుగంధద్రవ్యం పండుతుంది. ఎక్కువగా కాశ్మీర్లో పెరుగుతుంది. దీనిని కాశ్మీరజ-కుంకుమ అని కూడా వ్యవహరిస్తారు. Corcus^Salivus Saffron అని ఇంగ్లీషులో దీనిని పిలుస్తారు. కుంకుమపువ్వు కేసరములు కలిగి ఉంటుంది. ఈ కేసరములు ఎర్రగాను, కొంచెం తెల్లగాను ఉంటాయి. రంగువేయబడిన కృత్రిమమైనవి బజారులో లభిస్తూ ఉంటాయి. ఇవి అసలైనవి అని తెలుసుకోవాలంటే కొంచెం చేతిలో వేసి నలిపి చూడాలి. చేతికి రంగు అంటుకుంటే అది అసలైనది కాదు. అంతేకాక నీటిలో వేసి చూస్తే నీటిలో రంగు దిగిందంటే అది రంగువేసిన కుంకుమపువ్వు అని అర్థం. 

శ్రేష్టమైన కుంకుమపువ్వు రంగు చేతికి అంటదు. నీటిలో రంగు దిగదు.  అంతేకాక అసలైన కుంకుమపువ్వు కొంచెం చమురు గుణాన్ని కలిగి ఉంటుంది. 

కుంకుమపూవు గుణములు

కారము, చేదు రుచి గలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. వాత కఫములు హరిస్తుంది. దగ్గులు ఉపశమింపచేస్తుంది. విష దోషములు శమింపచేస్తుంది. కంఠరోగములు, తలనొప్పులు తగ్గిస్తుంది. వీర్యవృద్ధి, ధాతు పుష్టి కలిగిస్తుంది. ముక్కు, చెవి, కన్ను, నోరు, శిరస్సు లకు సంబంధించిన రోగములను తగ్గిస్తుంది.

మూత్రము జారీకానపుడు

కుంకుమపువ్వు మెత్తగా నూరి నీటిలో కలిపి దానిలో తేనెవేసి రాత్రి నిలువఉంచి ప్రాతఃకాలమున త్రాగినట్లయితే మూత్ర అవరోధములు తగ్గి మూత్రం సాఫీగా జారీ అవుతుంది.

శిరోరోగములు

కుంకుమపూవును పంచదార వేసి, ఆవునేతితో కలిపి లోనికి తీసుకున్నట్లయితే కనుబొమ్మలు మధ్యను, కణతలయందును, నేత్రములయందు, చెవులయందును, సూర్యావర్తమందు వచ్చే శూలలు నశిస్తాయి. 

బొల్లికి

రేల చెట్టు వేరు అరగదీసి ఆ గంధములో కుంకుమపూవు కలిపి బొల్లికి రాసిన బొల్లులు తగ్గుతాయి. అంతేకాక ఇదే మందును మొటిమలపై రాసినా అవి తగ్గుతాయి. 

బాలింతలకు

రెండు చిటికెల కుంకుమపూవు, ఆరుమిరియాలతో కలిపి నూరి ప్రసవించిన స్త్రీకి ఇచ్చినట్లయితే గర్భశోధన చేసి వేస్ట్ బ్లెడ్ ను బైటికి పంపించివేస్తుంది. జ్వరము రానీయదు. 

నేత్ర రోగములకు

  • ఇండుబగింజ గంధములో కుంకుమపూవు కలిపి కంటిచుట్టూ పట్టువేసినట్లయితే కంటివ్యాధులు తగ్గుతాయి. 
  • నిమ్మకాయ రసములో కరక్కాయ అరగదీసి దానిలో కుంకుమపూవు కలిపి కంటికి పట్టువేసినట్లయితే నేత్రరోగములు తగ్గుతాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.