ఆరెచెట్టు: ఆరెచెట్టు పువ్వులతో గర్భిణులకు అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఈ చెట్టు పర్వత ప్రదేశాలలో పెరుగుతుంది. ఈ చెట్టుచాలా పెద్దది. Woodfordia Floribunda అని ఆంగ్లములో పిలుస్తారు. దీని శాస్త్రీయనామం Lytherum Fruticosum, Grisleatomentosa. ఆకు తెప్పతంగేడు ఆకు వలె ఉంటుంది. ఆకులు జంటలు జంటలుగా రెండేసి ఉంటాయి. కాయలు కూడా తంగేడు కాయలవలె ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. కొంచెం కోలగా ఉంటాయి. ఒక గుత్తిలో పది పువ్వుల వరకూ ఉంటాయి. పువ్వు కొంచెం ఎరుపురంగులో ఉంటుంది. పువ్వులో మృదువైన పుప్పొడి ఉంటుంది. పట్ట నుండి నార వస్తుంది. పంజాబ్, ఢిల్లీ, హిమాలయ ప్రాంతాల్లో విస్తారంగా ఈ చెట్లు ఉంటాయి.
ఆరెచెట్టు గుణములు
రుచి వగరుగాను, చేదుగాను ఉంటుంది. చలువచేసే స్వభావము కలిగినది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. దీని పువ్వులకే మిక్కిలి ఉపయోగము కలదు. పట్టకు కూడా ప్రయోజనం ఉంటుంది. ద్రవపదార్ధములు కుళ్ళి చెడిపోకుండా నిలువ ఉంచే గుణము కలిగి ఉంటుంది. దీనితో తయారు చేసే ద్రవ ఔషధములు పది సంవత్సరాలైనా చెడకుండా ఉంటాయి. నిలువ ఉన్నకొద్దీ గుణం అధిక మవుతుంది. గర్భిణులకు తరుచుగా కలిగే గర్భస్రావములను ఆపే శక్తి ఈ ఆరెపువ్వుకు ఉంది. రక్తపిత్తము, క్రిములు, అతిసారము, ప్రదరములు శమిస్తాయి. వ్రణములను మాన్పుటలో దీనికి మించిన మందు లేదు.
కుష్టురోగములకు
లొద్దుగ పువ్వును, ఆరెపువ్వును మెత్తగా నూరి కుష్ఠులకు పై పూత వేసినట్లయితే కుష్ఠములు నశిస్తాయి.
వ్రణములకు
లొద్దుగ, ఆరెల కషాయముగాని, చూర్ణము గాని, వీటి కషాయ ఘృతము తో గాని వ్రణములను మానుతాయి.
అసృగ్దరమునకు
ఆరెపువ్వు ముద్ద గచ్చకాయంత, బియ్యపు కడుగుతో కలిపి తాగించినట్లయితే అసృగ్దరములు తగ్గుతాయని చక్రదత్త గ్రంథములో వివరింపబడి ఉంది. ప్రవాహికకు పెరుగుతో ఇచ్చినట్లయితే ప్రవాహిక కడుతుంది.
జ్వరములో వచ్చే అతిసారములకు కషాయములో శొంఠిచూర్ణము, దానిమ్మ రసము కలిపి ఇచ్చినట్లయితే జ్వరాతిసారము కడుతుంది.