కొండ కసివింద: యాస, దీర్ఘమూల, అధికంటక అని సంస్కృతంలో పేర్లు కలిగిన కొండ కసివింద ఖాళీ ప్రదేశాల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ కొండ కసివిందకు ములుకసివింద, తీటకసివింద అనే పేర్లు కూడా ఉన్నాయి. దీనిని ఇంగ్లీషులో Toddalia Aculeata అని పిలుస్తారు.
డొంకలా అల్లుకునే తీగ జాతిలోనిది. దీనికి నూగు ఉన్న ఆకులు, ముళ్ళు ఉంటాయి. ఆకృతి దూలగొండిని పోలి ఉంటుంది. దూలగొండి కంటే దీని ఆకులు పెద్దవిగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో పూచి వర్షాకాలం చివరిలో కాయలు కాచి పళ్ళు పండుతాయి. ఆపై క్రమక్రమంగా క్షీణించిపోతుంది. వేరు పొడవుగా ప్రసరిస్తుంది.
కొండ కసివింద గుణములు
కొండ కసివింద సమూలముగా తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. శీతవీర్యము కలిగి ఉంటుంది. విపాకమున మధురరసముగా మారుతుంది. కఫమును హరిస్తుంది. మేదస్సును క్షీణింపచేస్తుంది. పిత్తరక్తమును, వాత రక్తమును కూడా హరిస్తుంది. భ్రమ, దప్పి,విసర్పిని పోగొడుతుంది. దగ్గును తగ్గిస్తుంది. జ్వరమును తగ్గిస్తుంది. వాంతిని కడుతుంది. జఠరదీప్తిని పుట్టిస్తుంది. బలకరమైనది.
చలిజ్వరములకు
కొండ కసివింద వేరుపై ఉండే చెక్క చూర్ణము చేసి ఆ చూర్ణము తెల్లజిల్లేడు పువ్వుల రసముతో ఏడు రోజులు మర్దనా చేసి ఇండుబగింజలంత మాత్రలు చేసి జ్వరము వదలిన వెంనుక గంటకొక మాత్ర చొప్పున ఐదు మాత్రలు వరకూ ఇచ్చినట్లయితే మన్యజ్వరములు(మలేరియావంటివి), చలిజ్వరములు కడతాయి. రెండు చెంచాల కొండ కసివింద వేరు రసమును త్రాగినట్లయితే అజీర్ణ విరేచనములు కట్టి కడుపు ఉబ్బరము తగ్గుతుంది.
వాతనొప్పులకు
కొండ కసివింద సమూలముగా గ్రహించి మెత్తగా దంచి కషాయము పెట్టి ఆ కషాయములో నువ్వులనూనె పోసి, నూనె మిగిలేలా కాచి ఆ తైలము మర్దనా చేసినట్లయితే వాతనొప్పులు పోతాయి.