కొబ్బరిచెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

 

నారికేళ, విశ్వామిత్రప్రియ అని సంస్కృతంలో పిలిచే కొబ్బరికాయ శాస్త్రీయనామం Nucifera, Palma Indica. ఇంగ్లీషులో Major, Coconut అని పిలుస్తారు. ఈ చెట్టు సుమారుగా యాభై అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కొమ్మలుండవు. నాలుగైదు గజముల పొడవుగల మట్టలు ఉంటాయి. మట్టలకు రెండంగుళముల వెడల్పు, గజము పొడవు కలిగిన ఆకులు ఉంటాయి. మ్రానుకడుతుంది. మొవ్వునకు సమీపంలో ఉండే మట్టల సందులో గెలలు బయలుదేరి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. కొబ్బరికాయలోని గుంజు మధురముగా ఉంటుంది. శీతవీర్యము, స్నిగ్ధగుణము, మధురవిపాకము. లేతవి వాత పైత్యములను తగ్గిస్తాయి. ముదిరినవి శ్లేష్మ,పైత్యములను చేస్తాయి. 

ముదర కొబ్బరి గుణములు

దీనిలో నూనె ఉంటుంది. ముక్కలుగా కోసి ఎండలో పెట్టి గానుగలో పెడితే నూనె వస్తుంది. ముదరకాయ శ్లేష్మకారి, దేహపుష్టిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది. నుసదగ్గు వస్తుంది. కడుపునొప్పి, మలబద్దమును చేస్తుంది. నులిపురుగులను కలిగిస్తుంది.

కొబ్బరినీరు

మధురముగా ఉంటుంది. శీతవీర్యము, మధురవిపాకము. వాతపైత్యములను హరిస్తుంది. మూత్రమును శుద్ధిపరుస్తుంది. చురుకును తగ్గిస్తుంది. కడుపులోని పైత్యపు మంటలను తగ్గిస్తుంది.

కొబ్బరిపువ్వు

వగరురుచి కొంచెం తీపిరుచిగా కూడా ఉంటుంది. శీతవీర్యము కలిగినది. విపాకమున తీపిరుచిగా మారుతుంది. కొబ్బరిలో సర్వాంగములు ఉపయోగకరమైనవి. ఇది ఒక కల్పవృక్షము.

పార్శ్వపునొప్పులకు

కొబ్బరినీళ్ళు తాగినట్లయితే పార్శ్వపునొప్పులు ఉపశమిస్తాయి. 

పరిణామశూలలకు

ముప్పేటకొబ్బరికాయ తొక్క పలచగా ఒలిచి దానికి చిన్న కన్నము చేసి దానినిండా ఉప్పు వేసి మరలా కన్నమును కప్పి కాయకు బాగా మట్టిపూసి ఆరనిచ్చి పిడకలతో పుటము పెడితే నీరు హరించి పక్వమవుతుంది. అది పగులకొట్టి లోని పదార్ధమంతా తీసి దానిలో పిప్పలి చూర్ణము కలిపి తింటే పరిణామశూలలు కడతాయని భావప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది. 

శర్కరా రోగమునకు

కొబ్బరిపువ్వు మెత్తగా నూరి పెరుగులోకలిపి తాగినట్లయితే మలమూత్రములందుఉండే శర్కరలు హరిస్తాయి.

కుసుమలకు

కొబ్బరిపువ్వు రసములో పంచదార కలిపి ఇచ్చినట్లయితే తెల్లకుసుమలు తగ్గుతాయి. నీళ్ళ విరేచనములు, రక్తగ్రహణి కూడా హరిస్తుంది. ఆసనము వెంట పడే రక్తమును ఆపుతుంది. ఈ రసమునే ముక్కులో వేసి పీల్చినట్లయితే ముక్కునుంచి రక్తంకారడం తగ్గుతుంది. 

చుండ్రు, తలవెంట్రుకలకు

కొబ్బరి రుబ్బి పాలు పిండి తలకు మర్దనా చేసినట్లయితే చుండ్రు, తలవెంట్రుకలు ఊడడం తగ్గుతుంది. నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.

వరిబీర్జమునకు

కొబ్బరికోరు ఆవునేతితో వెచ్చచేసి కట్టినట్లయితే వాపు, బాధ శమిస్తుంది.

నేత్ర రోగములకు

వంద కొబ్బరిబొండాలలోని నీళ్ళు, సైంధవలవణం ఆరుతులాలు, ఉసిరిపప్పు ఒక కిలో, కరక్కాయలు ఒక కిలో, తాడికాయలు ఒక కిలో, మ్రానిపసుపు అరవీశెడు, యష్టిమధుకము అరవీశెడు, పచ్చకర్పూరము ఐదు తులాలు, తేనె రెండు వీశెలు తీసుకోవాలి. ముందుగా కొబ్బరినీళ్ళు, తేనె, పచ్చకర్పూరము విడిగా ఉంచి, మిగిలిన పదార్ధాలన్నింటినీ మెత్తగా చితక్కొట్టి 16లీటర్ల నీటిలో వేసి నాలుగు వంతులు మిగిలేలా కషాయము కాచాలి. ఆ కషాయము వడకట్టి దానిలో కొబ్బరినీళ్ళు, తేనె కలిపి తేనెపాకముగా కాచాలి. తయారయిన వెంటనే దింపి అందులో పచ్చకర్పూరము నూరి కలపవలెను. దీనిలో నారికేళాంజనము అంటారు. ఇది ఒకటిలేక రెండు చుక్కలు కంటిలో వేసినట్లయితే సమస్తనేత్ర రోగములు కూడా పోతాయి. ఇది సుప్పసిద్ధ అనుభవయోగము అని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది. 

త్రేనుపులకు

కొబ్బరికాయలపైన పచ్చి డొక్కలు రసము పిండి లోనికి ఇచ్చినట్లయితే తేనుపులు కడతాయి. 

తామర, దద్దురులు, తీటకు

ముదర కొబ్బరిచిప్పలు ముక్కముక్కలుగా కొట్టి అడుగున ఉన్న అడుగున చిన్న చిల్లు గల కుండలో పోసి మీద మూకుడు కప్పి ఒక గొయ్యి తీసి దానిలో ఒక మట్టిపిడత పెట్టి దానిమీద మనం ముక్కలు వేసి ఉంచిన రంధ్రముకల కుండను ఉంచి గొయ్యి చుట్టూమట్టితో కప్పి కుండపైన పుటము వేసినట్లయితే పెంకుల నుండి చమురు దిగువ పిడతలోకి దిగుతుంది. ఆ చమురు రాసినట్లయితే తామర, దద్రులు, తీట మొదలైన చర్మవ్యాధులన్నీ పోతాయి.

క్రిములకు

కొబ్బరికాయ డొక్కలలోని పొట్టు మెత్తగా నూరి దానిలో 12 గ్రాముల కురంజీవాము, మోదుగుమాడల రసముతో కలిపి ఇచ్చినట్లయితే కడుపులోని పాములు పడిపోతాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.