నిద్రగన్ని: లజ్జారు, శమీపత్ర, రక్తపాది అని సంస్కృతంలో పేరు కలిగిన నిద్రగన్నిని ఇంగ్లీషులో Mimosaensitive, M.Pudica అని పిలుస్తారు. ఇది చిన్నమొక్క జాతిలోనిది. సాధారణంగా నీటిఒడ్డున, తేమగల ప్రదేశాలలోను పెరుగుతుంది. దీనినే సాధారణ భాషలో అత్తపత్తి చెట్టు అని కూడా పిలుస్తారు. విడివిడి పత్రాలు కలిగి ఉంటుంది. ఆకు మధ్యలో చిన్న ఈనె ఉండి జమ్మి ఆకులను పోలి ఉంటాయి. వేరు ఎర్రగా ఉంటుంది. ఆకులు చేతితో తాకినా, పుల్లతో స్పృశించినా ముడుచుకుంటాయి. రాత్రుల్లో ఈ ఆకులు వాటంతట అవే ముడుచుకుంటాయి. అందుకే దీనికి నిద్రగన్ని చెట్టు అని పేరు. వీటిలో ఎరుపు పువ్వులు, పచ్చపువ్వులు కలిగినవి రెండు రకాలు.
నిద్రగన్ని గుణములు
చేదును, వగరును కల రుచితో ఉంటుంది. దీనిలో కారపు రుచి కూడా కొంచెం ఉంటుంది. చలువచేసే స్వభావంతో ఉంటుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. లఘుగుణము, కఫపిత్త గుణములను హరిస్తుంది. రక్తాతిసారమును బోచేస్తుంది. ఉబ్బు, తాపము, శ్రమ, శ్వాస, వ్రణము, కుష్ఠు మొదలైన వ్యాధులు హరిస్తాయి. యోగి రోగములను పోగొడుతుంది.
పెద్ద ఆకులు కలిగిన చిన్నమొక్క
నిద్రగన్ని ఎంతో ఉపయోగకరమైనది. ఉష్ణవీర్యమైనది. కటురసము. కఫహరము, రసము చాలా ప్రయోజనము.
అతిమూత్రములకు
పచ్చని పువ్వులు కలిగిన నిద్రగన్నికాడలను నూరి తాటికలకండ కలిపి ఇండుపగింజలంత మాత్రలు చేసి పంచవల్కల కషాయముతో సేవిస్తూ ఉన్నట్లయితే అతిమూత్రవ్యాధిని పోగొడుతుంది.
వ్రణములకు
ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం గంగసింధూరమును కలిపి రాసినట్లయితే కురుపులు, సవాయిపుండ్లు మానుతాయి.
శగలకు
నిద్రగన్ని ఆకు, మంచి గంథపుపొట్టు, కలబంద రసముతో నూరి మాత్రలు కట్టి సేవిస్తూ ఉన్నట్లయితే శగలు, శుక్రనష్టము కడుతుంది.
వీర్యవృద్ధికి
ఆకులు ఎండించి టీ, కషాయములా కాచి అందులో పాలు, పంచదారను కలిపి టీలా తాగుతూ ఉంటే వీర్యవృద్ధి, వీరస్తంభనము కలుగుతుంది.
కంటివ్యాధులకు
నిద్రగన్ని సమూలం కషాయం పెట్టి కషాయమునకు నాలుగవ వంతు మంచినూనె పోసి తైలం మిగిలేలా కాచాలి. ఆ నూనెతో దీపం పెట్టి ఒక మూకుడుకు మసి పారించాలి. ఆ మసిని ఒక రాగి పళ్ళెముతో తీసి ఆ మసిని కంటికి కాటుకలా పెట్టుకున్నట్లయితే దళసరి రెప్పలు, కంటి పొరలు, కంటి పూతలు తగ్గుతాయి.
యోనివ్యాపత్తులకు
నిద్రగన్ని సమూల చూర్ణమును, నాగకేశరముల చూర్ణమును సమానభాగాలుగా కలిపి పాలతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే సమస్త యోని దోషములు నశిస్తాయి. ఇలా ఋతుస్నానదినము మొదలు తిరిగి ఋతుమతి అయ్యే వరకూ చేయాలి. ఇలా చేసినట్లయితే వంధ్య కూడా గర్భమును ధరిస్తుందని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో వివరింపబడింది. నిద్రగన్ని ఆకు రసముచే రసదోషములు పోతాయి.