కత్తిమందు చెట్టుతో ఎన్నో వ్యాధులు మాయం

 

కత్తిమందు చెట్టు: వజ్రక్షీరి, వజ్రకంటక, త్రిధారి అని సంస్కృతంలో పిలిచే కత్తిమందు చెట్టు తుది నుంచి మొదలు వరకూ వాడియైన ముళ్ళతో ఉండే చెట్టు. దీనిని ఇంగ్లీషులో Euphorbia Anitiquoram అని పిలుస్తారు. ఈ చెట్టు శాఖలన్నీ మూడు పలకలు కలిగి ఉంటుంది. ముళ్ళ మొదట నూగు ఉంటుంది. ముళ్ళు మూడునాలుగు కలిపి జంటజంటగా ఉంటాయి. ముళ్ళు సాధారణంగా పలకల అంచులపైనే ఉంటాయి. దీనికి ఆకులు ఉండవు. ఇది గుజ్జుగా, శాఖోపశాఖలుగా పెరుగుతాయి. చెట్టు యొక్క సర్వాంగముల యందు పాల వంటి తెల్లని ద్రవం ఉంటుంది. శాఖ నరికి పాతినట్లయితే బ్రతికి విస్తరిస్తుంది. సాధారణంగా దీనిని త్రిధారిచెముడు అని పిలుస్తారు. దీనికి నేత్రారిః, వాతారిః అనే పేర్లు కూడా ఉన్నాయి.

కత్తిమందుచెట్టు గుణములు

ఇది చేదు రుచి కలిగి ఉంటుంది. వేడిచేస్తుంది. గురుగుణము. వాతకఫములను హరిస్తుంది. పొత్తికడుపులో ఉన్న వాతమును శోధించి తీవ్రమైన విరేచనము చేస్తుంది. దీని పాలు విషమును, కడుపు ఉబ్బరమును హరిస్తాయి. విశేషంగా గుల్మములను, ఉదరములను శమింపచేస్తుంది. కఫవాతములను పోగొడుతుంది. కడుపులోని బల్లలను కరిగిస్తుంది. ఉన్మాదములను, కుష్ఠురోగములను, మేహములను, మూలవ్యాధులను, శూలలను, ఉబ్బులను తగ్గిస్తుంది. వ్రణములను శోధిస్తుంది. జ్వరము వల్ల వచ్చిన బిళ్ళలను కరిగిస్తుంది. 

విరేచన ద్రవ్యములలో ఇది తీక్షమైన విరేచన ద్రవ్యము. కావున దీనిని మృదుకోష్టములను కలవారికి ఇవ్వకూడదు. అల్పదోషము కలిగి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడకూడదు. మిక్కిలి దారుణ పరిస్థితులలో కూడా దీనిని ఇచ్చిన తక్షణమే పనిచేస్తుంది. దీనిపాలతో  కత్తిమందును తయారుచేస్తారు. ఇది చాలా జిగురుగా, బింకముగా ఉంటుంది. కనుక దీనిని కత్తిమందు చెట్టని పేరు వచ్చింది.

కత్తిమందుచెట్టు  ఔషధములు

జలోదరమునకు

త్రిధారి పాలలో బియ్యపు పిండి కలిపి వండి ఆ పిండితో అప్పములను చేసి వండి తినిపించినట్లయితే ఏడు రోజులలో దారుణమైన జలోదరములు కూడా హరిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది. ఈకత్తిమందు చెట్టు చిగుళ్ళను కూరవండి పెట్టినట్లయితే మలబద్ధముగల తత్వములో కూడా బాగా పనిచేసి బాగుగా విరేచనము చేసి ఉదర రోగములను హరిస్తుంది. దీని పాలు పైన పట్టు వేసినట్లయితే హెర్నియా తగ్గుతుంది. వాతనొప్పులు హరిస్తుంది. గ్రంథులు కరుగుతాయి. రాచపుండ్లు, సమస్తమైన వ్రణములను హరిస్తుంది. 

నూనె సోలడు, కత్తిమందుచెట్టు పాలు సోలడు, ఆవుపాలు సోలడు కలిపి నూనె మాత్రం మిగిలేలా కాచి పైన మర్దించినట్లయితే పక్షవాతములు కూడా శమిస్తాయి. దీనిపాలు చనుబాలలో కలిపి నాలుగు లేక ఐదు చుక్కలు సస్యము చేయించినట్లయితే మూర్ఛ, అపస్మారము తదితర రోగములు శమిస్తాయి. రోగి పరిస్థతిని కనిపెట్టకుండా ఎక్కువమోతాదులో వాడినట్లయితే ప్రాణాపాయం. అందువల్ల ఈ మందు తాగిన తరువాత పైత్యోపచారములను చేయాలి. పెరుగుఅన్నము, పంచదార పానకము పట్టించాలి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.