కమలాఫలము: కురుంబ, కులపాలక అని సంస్కృతంలో పిలిచే కమలాఫలము ఆకృతిని బట్టి నిమ్మజాతికి చెందినది. నారింజ చెట్టుకు, ఈ కమలా చెట్టుకు పోలిక ఉంటుంది. దీన్ని ఇంగ్లీషులో Citrus Aurantium, Sweet Orange అని పిలుస్తారు.
కమలాఫలము గుణములు
కమలాఫలము తీపిరుచి కలిగినది. చలువ చేస్తుంది. గురుగుణము కలిగి ఉంటుంది. విపాకమున కూడా తీపి రుచే కలిగి ఉంటుంది. పైత్యము, తాపము, మేహమును తగ్గిస్తుంది. వాంతిని హరిస్తుంది. దప్పిని కడుతుంది. పచ్చికాయలు పుల్లగా ఉండి పైత్యం చేస్తాయి. కఫమును పెంచుతుంది. మన్య ప్రాంతాలలో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి.
నిమ్మజాతి ఫలాల్లో లెమొనేన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది దోమల్ని, ఈగల్ని దూరం చేస్తే శక్తిని కలిగిఉంటుంది. అందుచేత ఈగలు, దోమలు ఎక్కువగా ఉన్నచోట ఈ కమలాపండు తొక్కలను పెడితే మంచిది.