అయస్కాంతము అనే పేరు కలిగిన ఈ కాంతలోహము లోహములలో ఒక జాతి. దీనిలో ఐదు భేదములు ఉంటాయి. భ్రామకము, చుంబకము, కర్షకము, ద్రావకము, రోమకము. ఈ ఐదు జాతుల కాంతమునకు ప్రత్యేకంగా రంగులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాంతలోహములో పసుపు, నలుపు, ఎరుపు రంగులు కలిగి ఉంటాయి. భూమి నుండి తవ్వి తీసే ఖనిజద్రవ్యము. కొన్ని రాళ్ళలో ఈ లోహము మిళితమై ఉంటుంది. ప్రత్యేకంగా లోహము భూమిలో ఉంటుంది. దీనికి అనేక ముఖాలు ఉంటాయి. సూది గాని, ఇనుపమేకును కాని ఆకర్షించే స్థలమునకు ముఖము అని అంటారు. సర్వతోముఖము కలిగిన అయస్కాంతము అన్ని వైపులా ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. వీనిలో సర్వతోముఖము కలిగినది శ్రేష్టమైనది. దీని రంగును బట్టి ప్రయోగము కూడా వేరుగా ఉంటుంది. పసుపు వర్ణము కలిగిన అయస్కాంతం రసవాదమునందు, నలుపురంగు కలిగినది రసాయన కర్మయందు, ఎరుపు వర్ణము కలిగినది రసబంధమందును ముఖ్యంగా ఉపయోగిస్తారు. ద్రావకం అనేది శ్రేష్టముగా పరిగణింపబడుతుంది. భ్రామకము, చుంబకములు ఔషధములలో ఉపయోగపడతాయి.
అయస్కాంతం గుణములు
చేదు రుచి, శీతవీర్యము కలిగినది. విపాకమున మధుర రసముగా మారుతుంది. రూక్ష్ణ, ఉష్ణములు దీని స్వభావములు. మూడు దోషముల వలన కలిగే వికారములను హరిస్తుంది. మేహములను తగ్గిస్తుంది. గుల్మ, ప్లీహ, యకృత్ వ్యాధులను నివారింపచేస్తుంది. క్షయ, పాండు రోగములను తగ్గిస్తుంది. ఉదర రోగములను హరిస్తుంది. క్రిములు, జ్వరములు శమింపచేస్తుంది. లోహ జాతిలో ఉత్తమమైన ఈ కాంత లోహముతో కాంతవల్లభరసము అనే ఔషధమును తయారుచేస్తారు.
ఉబ్బులకు
కాంతభస్మము మూడు గురువిందగింజల ఎత్తు, త్రిఫలచూర్ణము 9గురివిందగింజల ఎత్తు కలిపి తేనెతో గాని, త్రిఫల కషాయముతో గాని ఇచ్చినట్లయితే మేహ నీరు తగ్గుతుంది.
రక్తవృద్ధికి
కాంతభస్మము పెన్నేరు చూర్ణముతో కలిపి తేనెతో సేవించినట్లయితే మంచి రక్తము వృద్ధి చెందుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది.
కామలా వ్యాధికి
కాంత భస్మమును త్రిఫలాచూర్ణము కలిపి తేనెతో ఇచ్చినట్లయితే కామలావ్యాధి తగ్గుతుంది. మందు ఇచ్చినవారికి గేదెపెరుగు అన్నము పెట్టవలెను.