కుంకుడు కాయలు అంటే అందరికీ తెలిసినవే. జుట్టు శుభ్రం చేసుకోవడానికి పూర్వం అందరూ ఇవే ఉపయోగించేవారు. ఇప్పట్లో అయితే షాంపూలు వాడేస్తున్నారు. ఈ కుంకుడుకాయలతో కేవలం జుట్టు శుభ్రంచేయడానికే కాకుండా ఈ చెట్టుతో అనేక ఉపయోగాలు ఉన్నాయని వస్తుగుణ ప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది.
ఈకుంకుడు కాయలనే కృష్ణబీజ అని సంస్కృతములో వ్యవహరిస్తారు. వీటి కాయలు నల్లగా ఉంటాయి. నురగ కలిగి ఉంటాయి. ఈ చెట్టు పెద్ద వృక్షజాతిలోనిది. ఆకు గుండ్రముగా ఉండి కొంచెం కోలగా ఉంటాయి. ఆకు నలుపు, పూవులు తెల్లగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. కాయలు ద్రాక్షపళ్ళ వలె గుండ్రముగా గుత్తులుగా కాస్తాయి. కాయలు లేక ఎండిన పళ్ళను చితక్కొట్టి నీళ్ళలో కలిపితే నురుగు వస్తుంది. ఈ కుంకుడుకాయలు త్రిదోషహారి.
పార్శ్వనొప్పులకు
కుంకుమపండు చనుబాలతో అరగదీసి నాలుగు లేక ఐదు చుక్కలు ముక్కులో వేసి పీల్చినట్లయితే పార్శ్వపు నొప్పులు కడతాయి. మగపిల్లలు ఉన్న తల్లి చనుబాలు ఆగరోగికి, ఆడపిల్లలు కలిగిన తల్లి చనుబాలు మగరోగికి ఉపయోగించాలి.
విషపదార్ధములు వాతికి
తెలియకుండా విషపదార్ధములు తిన్నట్లయితే వెంటనే కుంకుడుకాయల రసమును ఐదు లేక ఆరు చెంచాలు లోనికి ఇచ్చినట్లయితే వాంతి ద్వారా విషము బైటికి వెళ్ళిపోతుంది.
శిరోవాతములకు
కుంకుడు ఆకు మెత్తగా దంచి వెచ్చచేసి తలకు గట్టినచో శిరోవాతములు హరిస్తాయి.
చంటిబిడ్డల మలబద్దకమునకు
కడుపు ఉబ్బి విరేచనము కాకుండా బాధపడుతున్న చంటిపిల్లలకు కుంకుడు పళ్ళను గుజ్జుగా అరగదీసి నాభి స్థానములో పట్టు వేయాలి. అంతేకాకుండా ఆసనము లోనికి కూడా కొద్దిగా పెట్టినట్లయితే వెంటనే విరేచనము అవుతుంది.
మూర్ఛకు
కుంకుడుపళ్ళు రసము తీసి మూర్ఛ వచ్చి పడిపోయిన రోగికి ఐదారు చుక్కలు నోటిలో వేసినట్లయితే వెంటనే తెలివివస్తుంది.
విషహరము
పాము, తేలు కుట్టినచోట వెంటనే కుంకుమపండ్ల గుంజు అరగదీసి రాసి గుడ్డను కాల్చి పొగ వేసినట్లయితే విషము హరిస్తుందని ఆయుర్వేద గ్రంథములలో పేర్కొనబడింది.
ఉబ్బసపు దగ్గు
కుంకుకు పండు తేనెతో అరగదీసి నాకించినచో శ్లేష్మము దిగి ఉబ్బసము శమిస్తుంది.