పచ్చకర్పూరం : హిమకర్పూర అని సంస్కృతంలో పిలిచే పచ్చకర్పూరమును హారతికర్పూరము నుంచే తయారు చేస్తారు. హారతికర్పూరము యొక్క గుణములన్నీ దీనిలోఉండడమే కాకుండా మరికొన్న విశేష గుణములు కూడా ఈ పచ్చకర్పూరములో ఉంటాయి. హారతికర్పూరము యొక్క పరిణామమే పచ్చకర్పూరము.
పచ్చకర్పూరం ఎలా తయారుచేస్తారు?
హారతికర్పూరము నాలుగు తులాలు, గవ్వపలుకు సాంబ్రాణి నాలుగు తులాలు, లవంగాలు, జాపత్రి, జాజికాయ, యాలకులు, కస్తూరి, పసుపు, గవిళాలు, కుంకుమపువ్వు, కచ్చూరాలు ఒక్కొక్కటి అర తులం వంతున తీసుకుని వాటన్నింటినీ పన్నీరుతో గాని, మల్లెపువ్వుల రసంతో కాని మెత్తగా ముద్దగా నూరాలి. ఆ ముద్దమీద పింగాణీపాత్ర బోర్లించి, శీలఇచ్చి సన్నమంట పెట్టి బాగా వండాలి. ఐదారుగంటలు ఉడకబెట్టిన తరువాత పలుచని పలుకు పట్టి బెల్లుబెల్లులుగా వస్తుంది. ఇదే పచ్చకర్పూరము. ఈ పచ్చకర్పూరాన్ని మరికొన్ని పద్ధతుల్లో కూడా తయారుచేస్తారు.
పచ్చకర్పూరం గుణములు
చిరిచేదు కల రుచి కలిగి ఉంటుంది. చలువచేస్తుంది. విపాకమున కారపురుచికి మారుతుంది. లఘుగుణము, నేత్రవ్యాధులు, క్రిమి, రక్త, పిత్తము, అజీర్ణ విరేచనము, తాపము తదితర వ్యాధులను హరిస్తుంది. శగరోగములకు ఇది చాలా ఉపయోగకరమైనది. శుక్ల నష్టము, నిక్కాక, అతిమూత్రము కడుతుంది. దుర్గంధమును తగ్గిస్తుంది. పైత్య వికారములను అణుస్తుంది. కంటి మందుల లోను,ఇతర మందులలోను ఉపయోగకారి.
పచ్చకర్పూరంతో ఔషధములు
కంటిమంటలకు, ఎరుపులకు
పచ్చకర్పూరమును పాల ఆవిరిని శుద్ధిచేసి పిమ్మట మల్లెపువ్వుల మధ్యలో ఉంచి ఎండబెట్టి సాయంత్రము తీసి ఒక ఔన్సు పన్నీరులో (రోజ్ వాటర్) రెండు గురివిందగింజలెత్తు పచ్చకర్పూరము కలిపి కంటిలో మూడు లేక నాలుగు చుక్కలు వంతున వేస్తూ ఉంటే కంటి మంటలు, ఎరుపులు తగ్గుతాయి. దీనిలో మారీపత్ర రసముతో నూరి కంటికి కాటుకలా పెడితే పొరలు, కాయలు, మాంసకండరములు తగ్గుతాయని వస్తుగుణప్రకాశికలో వివరింపబడింది.
శుక్లనష్టమునకు
ఒక తులము పచ్చకర్పూరము, తులము మంచిగంధము, ఒక తులము తంగేడు గింజల పప్పు, తులము దూలగొండి గింజలపప్పు, తులము పల్లేరు విత్తులు, తులము గొబ్బి విత్తనాలు, అరతులము వంగ భస్మము తీసుకోవాలి. ఇవి అన్నీ వేసి కాచిన కషాయముతో పంచదార వేసి సేవిస్తూ ఉంటే శుక్లనష్టము కడుతుంది. వీర్యస్తంభనము చేస్తుంది. సంభోగశక్తిని కలిగిస్తుంది. ఈ మిశ్రమాన్ని చలువ మిరియాల కషాయముతో ఇచ్చినట్లయితే శగలు కడతాయి.