ఆర్ద్రక అని సంస్కృతంలో పిలువబడే అల్లము పసుపు, దుంపరాష్ట్రము మొక్క రకాలలోకి చెందినది. దీనిని ఇంగ్లీషులో Zingiber Officinalis, Ginger అని పిలుస్తారు. ఆకు అంగుళము వెడల్పు, ఆరంగుళములు పొడవు వరకూ పెరుగుతుంది. బెంగాలు, పంజాబు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలోను పెరుగుతుంది. చెన్నై, కొచ్చిన్, ట్రావెన్కూర్ లో ఇది విస్తారంగా పండి, చవకగా దొరుకుతుంది. దీని దుంపకే అల్లము అని పేరు.
అల్లము గుణములు
అల్లము కారపురుచి కలిగి ఉంటుంది. ఆకు కూడా కారపు రుచిగానే ఉంటుంది. విపాకమున తీపి రుచిగా మారుతుంది. వేడిచేస్తుంది.
తీక్ణగుణము
మలమును జారీచేస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. రుచిని పుట్టిస్తుంది. కఫవాతములను, మందాగ్నిని, శూలలు, వాంతి, ఆమదోషము, రక్తదోషము, క్రిమిజాతిని హరిస్తుంది. వీర్యవృద్ధిని చేస్తుంది. మూత్రబద్ధమును విప్పుతుంది. పాండురోగము, వీనసరోగము, కంఠరోగములు, ముక్కులో పుట్టే రోగములు శమింపచేస్తుంది. పొత్తికడుపులో చేరిన దోషములను అన్నింటినీ హరిస్తుంది.
అల్లం ఉపయోగములు
అల్లంముక్కలను సైంధవలవణంలో కలిపి భోజనానికి ముందు నమిలి రసము మింగినట్లయితే కంఠము బాగుపడి నాలుక రుచియై, ఆకలిని బాగా పుట్టిస్తుంది. భోజనం అనంతరం కూడా నిత్యం ఇలాగే చేస్తూ ఉంటే తిన్న ఆహారం బాగా జీర్ణమై రోగములు రాకుండా కాపాడుతుంది.
అల్లంతో ఔషధములు
- ఒక తులము అల్లం రసము, ఒక తులము తేనె, రెండు తులాలు ఆముదము కలిపి వెచ్చచేసి లోనికి పుచ్చుకుంటే బాగా విరోచనం అవుతుంది.
- అల్లం రసం తీసిన తరువాత కొద్ది సేపటిలో అడుగున తెల్లగా గడ్డకడుతుంది. దానిని వదిలివేసి తేట రసమునే ఉపయోగించాలి.
- అల్లంరసం పావుసేరు, నిమ్మరసం రెండు సేర్లు, పంచదార మూడు కిలోలు కలిపి పానకముగా కాచి దానిని నిల్వ ఉంచుకుని ఒక గ్లాసుడు నీళ్ళలో రెండు చెంచాల వంతున ఆ పానకం కలుపుకుని తాగితే అజీర్ణము, మలబద్దము, అరోచకము, పైత్య, వాత వికారములు , వాంతులు కడుతుంది. దీనిలో చిటికెడు సోడా కాని, మామూలు ఉప్పుకాని కలిపి తీసుకుంటే దీని గుణం అధికమవుతుంది.
- అల్లం రసములో బెల్లం కలిపి మూడు లేక నాలుగు చుక్కలు ముక్కులో వేసి పీల్చినట్లయితే అసాధ్యమైన పార్శ్వపునొప్పులు, తలనొప్పులు తగ్గుతాయి. అల్లం కూరలలో వేసి వండి తిన్నట్లయితే త్వరగా జీర్ణమవుతుంది.
- ఎండ పెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం. బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
- ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్సిడెం ట్ గా పనిచేస్తుంది .
- రక్త శుద్దికి తోడ్పడుతుంది . రక్తం రక్త నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది .
- అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .
- అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు . అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది
- నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాలను ఆరోగ్యముగా ఉంచుతుంది .
- ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకోవాలి.
- అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది.
- షుగర్ జబ్బు నియంత్రణ చేయయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము
అల్లం మురబ్బా
అల్లము పై పొట్టు తీసి ఈతముళ్ళతో కన్నములు పొడిచి పుల్లమజ్జిగలో ఒకరాత్రి నానబెట్టి ఆ ముక్కలను సున్నపునీటి ఆవిరిలో ఉడకబెట్టి తేనెలోగాని, పంచదార పాకములో గాని వేసినట్లయితే అల్లంమురబ్బా అవుతుంది. ఇది మిక్కిలి పైత్యశాంతి చేస్తుంది. అజీర్ణములు, మలబద్ధము, నోటనీరూరుట పోతాయి.