చాగ గుణములు
చాగ తీపిరుచి కలిగినది. వేడిచేసే స్వభావంతో ఉంటుంది. మధురవిపాకము కలిగినది. స్నిగ్ధగుణము. కఫవాతములను హరిస్తుంది. హృద్రోగమును(గుండెజబ్బులు) శమింపచేస్తుంది. విషమ జ్వరములకు చాలా ఉపయోగకరమైనది. కుష్ఠరోగమును హరిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. వాంతిని అరికడుతుంది. బలకరమైనది. పథ్యకరమైనది. మేహశాంతిని కలిగిస్తుంది.
నల్లచాగ గుణములు
తిక్తరసము, స్నిగ్ధత్వము, శీతవీర్యము కలిగి ఉంటుంది. త్రిదోషములను శమింపచేస్తుంది. వాతము, పిత్తము, జ్వరములు, తాపము, శ్రమ హరిస్తుంది. రక్తాతిసారము, ఉన్మాదము, మదము, పిశాచబాధలు పోగొడుతుంది. శ్వాసకాసలు, క్షయ తగ్గిస్తుంది.
చాగతో ఔషధములు
నేత్రరోగములకు
చాగ వేరు, సైంధవలవణము, సౌవీరాంజనము, మంచినూనె కలిపి కంచు పళ్ళెములో నూరి కంటికి వేసినట్లయితే కంటినొప్పులు తగ్గుతాయి.
సర్వజ్వరములకు
చాగవేరును,దేవదారు కలిపి కషాయము పెట్టి అది లోనికి పుచ్చుకున్నట్లయితే సర్వజ్వరములు హరిస్తాయని సుశ్రుతము అనే గ్రంథంలో వివరింపబడింది.
పైత్యవాంతులకు
చాగవేరు కషాయమును బియ్యపు కడుగులో కలిపి ఇచ్చినట్లయితే పైత్యవాంతులు తగ్గుతాయి.
చంటిపిల్లల శ్వాసకాసలకు
చాగ లేత మట్టల రసము, ఉగ్గులో కలిపి పట్టించినట్లయితే దగ్గు చంటిపిల్లలకు దగ్గు ఆయాసము తగ్గుతుంది.
వాత నొప్పులకు
చాగమట్టల రసము, మంచినూనె కలిపి నూనె మిగిలేలా కాచి ఆ నూనెను నొప్పులు ఉన్నచోటమర్దనా చేసినట్లయితే వాతనొప్పులు తగ్గుతాయి.