కర్పూరః , హిమాంశుః ఘనసార అనేపేర్లు కలిగిన కర్పూరము Cinnamomum camphora (పక్వ కర్పూరము), Dryobalanops Aromatica. Borneo Camphor (అపక్వక కర్పూరము) అనే రెండు రకాలు ఉంటాయి. మనదేశంలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి పచ్చకర్పూరము, హారతి కర్పూరము. ఈ కర్పూరము చెట్లను చైనా, జపాన్ దేశాల్లో ఎక్కువగా పెంచుతారు. ఈ చెట్టు దాల్చినచెట్టు జాతిలోనిది. ఇంగువ చెట్టు వలె ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలపై ఉంటే పొర దళసరిగా ఉంటుంది. పైన గంటు పెట్టినట్లయితే చిక్కని రసము స్రవిస్తుంది. చెక్కను పిండినా కూడా చిక్కని రసమునిస్తుంది. చెట్టుకు పైన మొవ్వు ఉంటుంది. ఈ కర్పూర చెట్టు కాయలు శెనగ కాయల వలె ఉంటాయి. పళ్ళలో ఉండే గింజలకు కూడా కర్పూరపు వాసన ఉంటుంది. చెట్టుకు గంటు పెట్టగా వచ్చిన పాల నుండే కర్పూరము తయారుచేస్తారు.
కర్పూరచెట్టు గుణములు
కర్పూరము చేదు రుచి కలిగి ఉంటుంది. ఇది శీతవీర్యము కలిగినది. వీర్యవృద్ధిని కలిగిస్తుంది. నేత్రములకు చాలా హితవైనది. మంచి సువాసన కలిగి ఉంటుంది. కఫపైత్యములను, విషములను హరిస్తుంది. తాపమును, దప్పిని, మేదో రోగమును, దుర్గంధమును హరిస్తుంది. ఎక్కుపాతమును తగ్గిస్తుంది. నిద్రను పట్టిస్తుంది. చెమటను పుట్టిస్తుంది. ఆవేదనను తగ్గిస్తుంది. కామశాంతిని కలిగిస్తుంది. శుక్రమేహమును చేస్తుంది. అపక్వకర్పూరము చాలా శ్రేష్టమైనది. రక్తపైత్యమును, కంఠ రోగమును తగ్గిస్తుంది.
కర్పూర లక్షణము
శిరము, మధ్యము, తలము అని కర్పూరము మూడు రకములు. శాఖాగ్రముల నుండి తీయునది శిరము, చెట్టుమధ్య నుండి తీయునది మధ్యము, ఆకుల నుండి తీయునది తలము. వీటిలో మాను మధ్య నుండి తీసే కర్పూరము శ్రేష్టమైనది. స్వచ్ఛమై, కొంచెం పసుపు రంగు కలిగిన కర్పూరము శ్రేష్టమైనది.
నరుకులకు
ఏదైనా ఆయుధం వల్ల కలిగిన నరుకులకు కర్పూరము నేతిలో కలిపి గాయము నిండా వేసి పైన కట్టుకట్టిన అతుక్కుంటుంది. రసికారడం వంటి బాధలు ఉండవు.
కర్ణపాలికి
అంటే చెవుల్లో ఒరవడం, పుండు అవడం, చెవి పై భాగంలో ఎలర్జీలా వస్తే దాన్నే కర్ణపాలి అంటారు. దీని నివారణకు కర్పూరము మేక మూత్రముతో కలిపి రాసినట్లయితే నివారింపబడుతుంది. దీనితోపాటు ఆవుపేడ వెచ్చచేసి దానిలో కర్పూరము కలిపి రాసినట్లయితే తగ్గుముఖం పడుతుంది.
కంటిలో పువ్వులకు
కర్పూరము మఱ్ఱిపాలలో కాటుకవలె నూరి నేత్రములలో వేసినట్లయితే పెద్దపెద్ద పువ్వులు కూడా కరిగిపోతాయని వస్తుగుణ ప్రకాశిక గ్రంథంలో వివరింపబడింది.
కర్పూరము మంచిగంధములో కలిపి ఒంటికి రాసుకున్నట్లయితే తాపము శమిస్తుంది. చర్మరోగములు హరిస్తాయి. రక్తములోని అధికవేడి తగ్గుతుంది.
కర్పూరము రెండు భాగము, అక్కలకఱ్ఱ, లవంగములు ఒక్కొక్క భాగము కలిపి మెత్తగా నూరి మాత్రలు కట్టి చల్లని నీటితో సేవించినట్లయితే దప్పి కడుతుంది. హారతి కర్పూరమఝ, జాజికాయ, కొడిసపాలగింజలు, పిప్పళ్ళు, యింగిలీకము, నల్లమందు సమభాగములుగా కలిపి నీళ్ళలో బాగా మర్దించి చిరికందిగింజలంత మాత్రలు చేసి సేవించినట్లయితే కలరా వ్యాధి మటుమాయమవుతుంది. అజీర్ణ విరేచనములు కడతాయి.
శతపుఠాభ్రకము, కర్పూరము సమభాగములుగా కలిపి చలవ మిరియాల అనుపానముతో ఇచ్చినట్లయితే శగలు కడతాయి.