ఏనుగు చెవి చెట్టు పొలి జ్వరానికి మందు

 

హస్తికర్ణి అని సంస్కృతంలో పిలిచే ఏనుగుచెవి చెట్టునే ఏనుగు చెవి చేమచెట్టు అని కూడా పిలుస్తారు. దీనినే ఇంగ్లీషులో Arum Macrorhizon అని అంటారు. ఈ చెట్లు ఉద్యానవనాల్లోను, భవనాల ముంగిట, కుండీలలోను పెంచుతారు. ఈ మొక్కలు గజం ఎత్తు వరకూ పెరుగుతాయి. ఈ మొక్కకు కోలగా ఉన్న తెల్లని దుంపలు కాస్తాయి. ఈ దుంపల నుండే మొక్క మొలుస్తుంది. ఆకులు చేటంత ఉంటాయి. ఆకారం కూడా అలాగే ఉంటుంది. ఏనుగు చెవి వంటి ఆకృతిలో ఉన్న ఆకులను కలిగి ఉండడం వల్లనే ఈ చెట్టుకు ఏనుగు చెవి చెట్టు అని పేరు. అంతేకాకుండా మట్టలు, ఆకులు చామ ఆకులను పోలి ఉంటాయి కనుక ఏనుగుచెవి చేమ చెట్టని కూడా పిలుస్తారు. ఆకులు దళసరిగా ఉంటాయి. నలుపు, తెలుపు రంగుల్లో రెండు జాతులు వీటిలో ఉన్నాయి. దీన్ని తమిళభాషలో వెర్రుంగు అని పిలుస్తారు. 

ఏనుగు చెవి చెట్టు గుణములు

ఈ చెట్టు వేడిచేసే గుణము కలిగి ఉంటుంది. రుచి వగరు, చేదు, తీపి కలిసి ఉంటుంది. దుంప కొంచెం తియ్యగా ఉంటుంది. దుంపను మెత్తగా నూరి నూనెలో వేసి కాచి ఆ నూనె తలకు మర్దనా చేసినట్లయితే పొలిజ్వరము తగ్గుతుంది. ఆకును మెత్తగా దంచి ఆముదములో ఉడికించి పొత్తి కడుపుకు కట్టినట్లయితే బాలింతల మైల రక్తము వెలువడుతుంది. ఈ కట్టు ఎక్కువ కాలము ఉంచకూడదు. ఏనుగుచెవి చెట్టు దుంపలను ఉడికించి కట్టినట్లయితే గడ్డలు పగులుతాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం ద్వారా తెలుస్తోంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.