
చంద్రశూర అని సంస్కృతంలో పిలువబడే ఆడాలు తుప్ప జాతికి చెందినవి. సువాసనగలిగిన ద్రవ్యము. ఈ ఆడాలునే ఇంగ్లీషులో Common cress అని పిలుస్తారు. ఆడాలు మొక్క ఆకు, వేరు, పువ్వు, గింజలకు వేర్వేరు ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయి. ఆసియా అంతటా పెరుగుతాయి. యూరప్ లో కూడా దీన్ని ఉద్యానవనాల్లో పెంచుతారు. గింజలు జిగురుగా ఉంటాయి. గింజలనుంచి తీసిన నూనె ఆవిరిగా మారిపోతుంది. కొవ్వుపదార్ధం కలిగి ఉంటాయి. ఆడాలు మొక్క గింజల రసములో ఇనుము, ఫాస్ఫేటు, గంధకము ఉంటుంది.
ఆడాలు గుణములు
సుఖ విరేచనము చేస్తుంది. మూత్రమును జారీచేస్తుంది. మంచి జీర్ణశక్తి కలుగచేస్తుంది. రుచి చిరుచేదుగా ఉంటుంది. వేడిచేసే స్వభావంతో ఉంటుంది. ఎక్కిళ్ళను నియంత్రిస్తుంది. వాత, శ్లేష్మములను, అతిసారమును, రక్తప్రదరములను నివారిస్తుంది. మంచి బలమును, పుష్టిని కలిగిస్తుంది. చనుబాలను వృద్ధిచేస్తుంది. దెబ్బలవలన కలిగిన బాధలను అన్నింటినీ శమింపచేస్తుంది. సమస్త చర్మరోగములను పోగొడుతుంది. రక్తదోషమును హరించి రక్తమును శుభ్రంచేస్తుంది.
ఔషధములు
- ఆడాలు మొక్క గింజలను చూర్ణముగాను, కషాయముగాను, చిక్కని పాయసముగా తయారుచేసి వినియోగిస్తారు.
- గింజలు మెత్తగా కొట్టి ఎనిమిదిరెట్లు నీళ్ళు పోసి నాలుగవ భాగము మిగిలేలా కాచి ఒక ఔన్సు కషాయము ప్రతి అరగంటకు ఒకసారి సేవిస్తూ ఉంటే తీవ్రమైన ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- వేరుచూర్ణము తేనెతో ఇచ్చినా ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- బాలింతరాలికి స్తన్యము లేకపోయినట్లయితే దీని గింజలు పాలతో మెత్తగా నూరి పాలతో జావకాచి ఇచ్చినట్లయితే స్తన్యము వృద్ధి అవుతుంది. ఇలా పురిటి రోజుల్లో చేయాలి.
- ఆడాలు గింజలు, కొబ్బరిపువ్వులు పాలతో పరమాన్నంలా ఉడికించి పంచదారగాని, బెల్లము గాని వేసి తింటే అమితమైన బలము, వీర్యవృద్ధి చేస్తుందని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది.
- వేరును నీటితో అరగదీసి దెబ్బలకు పట్టువేసినట్లయితే తగ్గుముఖం పడతాయి.
- గింజల చూర్ణమును నేతితో ఉడికించి నరాలకు రాసినట్లయితే అతుక్కుంటుంది. దెబ్బలు మానుపడతాయి. చర్మరోగములపైన రాసినట్లయితే సకల చర్మరోగములు నశిస్తాయి.
- ఈ ఆడాల మొక్కను ఇంట్లో ఉంచుకున్నట్లయితే ప్రతీ రోగమునకు వాడవచ్చు. ఆడాల ఆకులు నరములకు బలమునిస్తాయి.
- మూత్ర, విరేచనములను చేస్తుంది.
- గర్భిణీస్త్రీలకు ఇవ్వకూడదు.
- గింజలుపెద్ద ఆవగింజల వలె ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి.