చిన్నిచెట్టు అనే పేరు కలిగిన ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతములలో ఎక్కువగా పెరుగుతుంది. Acalipha Betulina అని ఇంగ్లీషులో పిలుస్తారు. ఈ చెట్టు ఇంచుమించుగా పాలచెట్టును పోలి ఉంటుంది. ఆకులు కొంచెం కలదనము కలిగి సువాసన కలిగి ఉంటాయి. పువ్వులు కూడా సవాసన కలవియే. ఈ పువ్వులలో అమృతరసము ఉంటుంది. ఆకు, వేరు వగరు రుచి కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము, కటు విపాకము కలిగినది. ఆకుల కషాయము కలరా నిర్మూలనకు పనిచేస్తుంది. అగ్నిమాంద్యమును తగ్గిస్తుంది. పొట్టకుబలమును కలిగిస్తుంది.
చిన్నిచెట్టు గుణములు
ఈ చిన్నిచెట్టు వసంతకాలములో పూతపూస్తుంది. పూతకాలంలో తేనెటీగలు చెట్లపైన ముసురుకుని తేనెను గ్రోలి ఆ చెట్లకు తేనెపట్లు పెడతాయి. ఆ పట్టుల నుండి తేనెను సేకరిస్తారు. ఈ తేనె మామూలు తేనెవలె కాకుండా పటిక పలుకుల పంచదార వలె ఘన పదార్ధంగా ఉంటుంది.
చిన్నిచెట్టులో ఔషధ గుణాలు
ఈ తేనెపలుకులు సువాసన కలిగి ఉంటాయి. అతి మధురము. మేహశాంతి, వీర్యవృద్ధి, అమితమైన బలమును కలిగిస్తుంది. రసాయనము. అరోచకమును అణుస్తుంది. వాంతులను కడుతుంది. నేత్రములకు చలువచేస్తుంది. సమస్త పైత్యములను హరిస్తుంది. అమృతమునకు, దీనికి భేదము లేదు. త్రిదోషహరము.