కుబేరాక్ష సంస్కృతంలో పిలువబడే గచ్చచెట్టుకు Caesalpinia Bonnoue, Molucea Bean Tree or Fevernut Tree అని ఇంగ్లీషులో పిలుస్తారు. కంటక, లతా జాతి లోనిది. కోరింతడొంకకు చేరింది. పొదలవలె అల్లుకుని దీర్ఘముగా పెరుగుతుంది. ఆకులు నిద్రగన్నేరు ఆకులను, కరివేపాకును పోలి ఉంటుంది. కాండమునకు ఆరు లేక ఏడు రెమ్మలు ఉంటాయి. ఈ రెమ్మలు కాండమునకు ఇటు అటు కూడా ఉంటాయి. రెమ్మల యొక్క సందులయందు, లతాకాండమునకు అంతా వాడియైన చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఆకు మృదువుగా ఉంటుంది. కాయ మామిడిటెంకను పోలి ఉంటుంది. కాయపైన ముళ్ళు, ముళ్ళవంటి నూగు కూడా ఉంటుంది. కాయలోని గింజలు నున్నగాను, పెంకు కలిగి ఉంటాయి. ఈ గింజలే గచ్చకాయలు. ఈ గింజలోని పప్పు విషమును కలిగి ఉంటుంది. అడవులలోను, చేలగట్లమీద పెరుగుతుంది. ఈ గచ్చచెట్టు సర్వాంగములు ఔషధములలో ఉపయోగపడతాయి.
గచ్చచెట్టు గుణములు
గచ్చవేరు కారము, వగరు రుచి కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావంతో ఉంటుంది. లఘుగుణము కలిగినది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. అగ్నిమాంద్యము, వాతకుష్ఠమును హరిస్తుంది. ఋతురక్తమును జారీచేస్తుంది.
గచ్చచెట్టు ఆకులు
గచ్చచెట్టుఆకులు చేదుగాను, ముదర ఆకులు కారముగాను ఉంటాయి. ఉష్ణవీర్యము కలిగినవి. శ్లేష్మ హరమైనవి. క్రిమి, శూలలను హరిస్తాయి. జ్వరహారి.
గచ్చపప్పు
చేదు,కారపు రుచి కలిగి ఉంటాయి. కొంచెం వగరు రుచి కూడా ఉంటుంది. వేడిచేస్తుంది. కటు విపాకము కలది. తీక్ష్ణగుణము. జ్వరములు, ఉబ్బసము, క్రిములు, మలబద్ధము హరిస్తుంది. దీనిలో విషము ఉంటుంది. వాంతిని కలిగిస్తుంది. మోతాదు ఎక్కువైనచో వికారం పెడుతుంది.
ఔషధములు
తేలు, జెర్రి విషములకు
గచ్చకాయ పప్పు అరగదీసి ఆ గంధము కుట్టినచోట రాసి గుడ్డపొగ వేసినట్లయితే విషము హరిస్తుంది.
ఏలికపాములు
గచ్చపప్పు నాలుగు భాగములు (ఇది ఆముదములో వేయించినట్లయితే శుద్ధి అవుతుంది.) మోదుగుమాడ మూడు భాగములు, శుద్ధనేపాలములు రెండు భాగములు, వేపగింజలు ఒక భాగము ఇవన్నీ కలిపి తేనెతోబాగుగా మర్ధించి శనగగింజలంత మాత్రలు చేసి రెండు లేక మూడు మాత్రలు వాయువిడంగములు, కురంజివాము రసముతో ఇచ్చినట్లయితే ఏలికపాములు, నులిపురుగులు, క్రిమి జ్వరములు హరిస్తాయి.
గచ్చపప్పు, రసగంధకములు, శుద్ధిచేసిన నేపాలములు, నాభి, ఇంగిళీకము సమభాగములుగా కల్వములో గుంటగలగర, అల్లపు రసముతో బాగుగా మర్ధించి శనగగింజలంత మాత్రలను సేవించినట్లయితే జంతువాతములు, శూలలు, అగ్నిమాంద్యము, చలిజ్వరములు తగ్గుతాయి. దీనినే క్రిమిసర్పగరుడాస్త్రము అని అంటారు.
అండవృద్ధికి, వరిబీర్జమునకు
గచ్చపప్పును కోడిగుడ్డుసొనతో అరగదీసి ఆ భాగంలో పట్టువేసినట్లయితే ఆ భాగములో వాపులు తగ్గుతాయి.
వాత నొప్పులకు
గచ్చపప్పునుండి తీసిన తైలము పైన మర్దనా చేసిన పక్షవాతములు, వాతపు నొప్పులు, ఆమవాత శూలలు తగ్గుతాయి.
దంత వ్యాధులకు
గచ్చపెంకుల మసి, కానుగవేరు, పొగడచెక్క, ఏలకగింజలు, దాల్చినచెక్క, తుమ్మచెక్క ఇవన్నీ మెత్తగా చూర్ణించి పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టిపడి చీము, నెత్తురు కడుతుంది.
గచ్చఆకు ఆముదముతో వెచ్చచేసి కట్టినట్లయితే వరిబీజములు హరిస్తాయి.