అభ్రకమును వ్యోమ అని సంస్కృతంలోను, Calx of blacktaleor mica అని ఆంగ్లములోను పిలుస్తారు. ఇది లోహము. భూమిలో దొరుకుతుంది. గనుల నుండి తవ్వి తీస్తారు. పినాకము,నాగము, మండూకము, వజ్రము అని నాలుగు విధములు. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు నే రంగులతో ఇది నాలుగు రకములుగా ఉంటుంది. రంగులను బట్టి కాలానికి ప్రత్యేక ఉపయోగములు ఉన్నాయి. వీనిలో కృష్ణాభ్రకము, శ్వేతాభ్రకము ఔషధములకు మిక్కిలి ఉపయోగకరమైనవి. కృష్ణాభ్రకము కొరివి నిప్పులలో ఎర్రగా కాల్చి ఆవుపాలలో గాని, ఆవు పంచకములో గాని ముంచాలి. ఇలా ఏడు సార్లు చేసినట్లయితే శుద్ధి అవుతుంది. నిప్పులపై కాల్చినప్పుడు చిటచిటమని పేలి, పొగ రావడం లేకుండా ఉన్నట్లయితేనే అది కృష్ణాభ్రకము అని తెలుస్తుంది. దీనని భస్మము చేసే ప్రక్రియలు అనేకములు ఉన్నాయి. భస్మముగా తయారైన కృష్ణాభ్రక, శ్వేతాభ్రక గుణములను తెలుసుకుందాం.
అభ్రకము గుణములు
తీపి వగరు కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. విపాకమున తీపి రుచిగా మారుతుంది. ఈ భస్మము వల్ల క్షయరోగము హరింపబడుతుంది. వాత పైత్యములను శమింపచేస్తుంది. వీర్యవృద్ధి, ఆయువును పెంచుతుంది. రక్తమును బాగుచేస్తుంది. రక్తవృద్ధిని కలిగించి మంచి బలమును ప్రసాదిస్తుంది. రక్త వృద్ధిని కలిగించి మంచి బలమును ప్రసాదిస్తుంది. పాండురోగము, దగ్గులు, శ్వాసలు, గ్రహణి, అజీర్ణము, శూలలు, కుష్ఠురోగములు, కుసుమలు లాంటి వేవేల రోగములను పోగొడుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథం ద్వారా తెలుస్తోంది. అదే భస్మము సరిగా తయారు చేయకుండా వాడినట్లయితే అదే భస్మము సమస్త రోగములను కలుగచేస్తుంది.
భస్మ పరీక్షా విధానము
నీటిలో వేసిన పైకి తేలిందంటే అదే సరైన భస్మము. వేళ్ళకు పూసినట్లయితే వేలిపైన రేఖలన్నీ స్పష్టంగా కనిపించాలి. అది కరిగిపోయి తిరిగి స్వస్వరూపమును పొందకుండా ఉండాలి. భస్మములో తళతళలాడే చంద్రికలు ఉండకూడదు. ఇలా ఉన్నదాన్నే శుద్ధమైన భస్మముగా తెలుసుకోవాలి.
అభ్రక చూర్ణముతో ఔషధములు
పైత్యమునకు
పంచదార, వెన్న, గులకందు లను ఈ భస్మముతో కలిపి సేవించినట్లయితే పైత్యము హరిస్తుంది.
వాతములకు
దశమూలక కషాయము, నెయ్యి, దుంపరాష్ట్రము, పెన్నేరు, త్రికటుకములు మొదలైనవి ఈ భస్మముతో కలిపి సేవించాలి.
శ్లేష్మమునకు
తేనె, శొంఠి, సన్నరాష్ట్రము, కరక్కాయ, త్రిఫలములు, అక్కలకర్ర, లవంగములు, ఏలకులు ఈ భస్మములో కలిపి సేవించాలి.
క్షయకాసలకు
సితోపలాది చూర్ణము, తాలీసాది చూర్ణము,ద్రాక్షాసవము, వాసారిష్ట తదితరాలను అభ్రకచూర్ణముతో కలిపి సేవించినట్లయితే క్షయకాసలు ఉపశమిస్తాయి.
శ్వాసలకు
గంటుభారంగి, తాడికాయ, అడ్డసరము మొదలైనవాటిని అభ్రకచూర్ణముతో కలిపి సేవించాలి.
ఎర్ర కుసుమలకు
ఈత వేళ్ళ కషాయము. ఈకషాయమును ఆవుపాలతో పెట్టవలెను. ప్రవాహరూపకమైన ఎర్రకుసుమలు(over bleeding) కడుతుంది. అభ్రకభస్మం పూస నుంచి మూడు పూసల ఎత్తు మోతాదులో ఈలవేళ్ళ కషాయంలో కలిపి సేవిస్తే ఎర్రకుసుమలు కడతాయి.