ఓదనః అని సంస్కృతంలో పిలిచే ఈ అన్నములో అనేక రకాలు ఉంటాయి. వరి అన్నము, గోధుమ అన్నము, గంటి అన్నము, జొన్న అన్నము, కొఱ్ఱ అన్నము మొదలైనవి. దీనిని ఆంగ్లములో Boiled Rice అంటారు. సాధారణంగా వరి బియ్యముతో తయారు చేసిన దానినే అన్నము అంటారు. కావున దీనిని గురించి విపులంగా తెలియచేయాల్సిన అవసరం లేదు.
అన్న లక్షణము
అన్నము తెల్లగా ఉండాలి. అన్నమును గంజి వార్చి చేయాలి. తినేటప్పుడు వేడి తగ్గకుండా ఉండాలి. ఇలాంటి అన్నము లఘుగుణము కలిగి తేలికగా జీర్ణం అవుతుంది. తుష్టి, పుష్టి కలిగిస్తుంది. ఈ అన్నమును నానా విధమైన షడ్రసోపేతమైన పదార్ధములతో కలిపి తిన్నప్పుడే అది గుణకారి అవుతుంది. ప్రత్యేకంగా అన్నము హితవుగా ఉండదు. ఏయే పదార్ధాలతో కలిపి మనం అన్నం భుజిస్తామో ఆ పదార్ధాల యొక్క గుణములతో కలిసి అన్నము స్వగుణమును ప్రసాదిస్తుంది.
అన్నముగుణములు
అన్నము చలువచేయు స్వభావము కలది. మూత్రమును జారీచేస్తుంది. తీపి, కొంచెం వగరు కలిసిన రుచి కలిగి ఉంటుంది. వరి అన్నము గాని, గోధుమ అన్నము కాని తింటున్నప్పుడు పానముగా చల్లటి నీటినే తాగడం మంచిది. మర బియ్యపు అన్నం మూత్ర వ్యాధులను కలిగిస్తుంది. ఎరడా బియ్యపు అన్నం ఎర్రగా ఉంటుంది. దీనిని మేహ వ్యాధులకు పథ్యముగా ఉపయోగిస్తారు. ఎర్ర కుసుమలు తగ్గడానికి ఈఎరడా బియ్యపు అన్నం శ్రేష్ఠమైనది. దంపుడు బియ్యపు అన్నమే సాధారణంగా శ్రేష్ఠమైనది. తవుడు ఉన్న బియ్యమే ఆరోగ్యానికి మంచిది. శిరోభారము కలిగినట్లయితే వేడి అన్నములో కొద్దిగా పసుపు కలిపి గుడ్డలో కట్టి శిరస్సును కాస్తారు.
అన్నం తినాల్సిన విధానము
స్నానం చేసి కాని, కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని తనకు హితమైనది, తన శరీరానికి సరిపడేది, శుచిగా వండిన, వేడిగా ఉన్నది, లఘుగుణము కలిగినటువంటి, షడ్రసోపేతములతో కూడుకొన్నటువంటి, తీపి ఎక్కువగా కలిగిన ఆహారమును అతి నెమ్మదిగాను, అతి చురుకుగాను కాకుండా ఆకలి ఉన్నప్పుడే ప్రత్యేకంగా కూర్చుని తన శరీర స్థితిని, భోజన పదార్ధములను పరిశీలించి, భోజనాన్ని నిందించకుండా, మధ్యలో మాట్లాడకుండా ద్రవముగా ఉండే పదార్ధాలతో అన్నమును భుజించాలి.
భోజనకాలము
మలమూత్రములు బాగా జారీ చేసి, హృదయం నిర్మలంగా ఉండడం, దోషములు స్వస్తానములు పొంది ఉండి, శుద్ధమైన త్రేనుపులు కలిగి, వాతము సస్యముగా ప్రసరించి, ఆకలి ఉండి, జఠరాగ్ని ఉద్రిక్తమై ఉన్నచో అదియే భోజనకాలము. ఇట్టి పరిస్థితి దేహమునకు ఎప్పుడు కలుగునో అప్పుడే భుజించవలెను.