ఫణపుష్ప, లింగపుష్ప, కాండపుష్ప, జటాపుష్ప అని సంస్కృతంలో పిలుచుకునే నాగమల్లి మల్లిపువ్వు ఆకారము కలిగి పొడుగుపాటి కాడగల పుష్పము. ఈ చెట్టు కాయలకు ఊధికాయలు అని కూడా పిలుస్తారు. ఈ నాగమల్లి మహావృక్ష జాతిలోనిది. చింత, మర్రి, రావి మొదలగు చెట్ల లాగానే ఇది కూడా మహావృక్షము.
నాగమల్లి చెట్టు ఆకులు మామిడి, అడ్డసరము, తొగర చెట్టు ఆకులను పోలి ఉంటాయి. మామిడాకు అంత ఆకు ఉంటుంది. ఆకులపై సమర రేఖలు ఉంటాయి. దిగువ వెన్ను కాడ ఉంటుంది. దీని మ్రాను నుండే సుమారు మీటరు పొడవు గలిగిన కాడ ఉండి కాడ నిండా సుమారు వంద వరకూ పువ్వులు, మొగ్గలు ఉంటాయి. మొగ్గ గట్టిగా, గుండ్రముగా ఉండి పెద్ద ఉసిరికాయంత ఉంటాయి. వికసించినట్లయితే అరచేయి అంత పుష్పము పూస్తుంది. పుష్పమునకు దిగువ పత్రములు ఐదారు వరకూ ఉంటాయి. అవి తామరపువ్వు రేకుల ఆకృతి కలిగి దళసరిగా, సువాసన కలిగి, నీరు కలిగి ఉంటుంది. పత్రముల మధ్యభాగంలో వరుసగా కింజల్కములు నాలుక వలె ఉంటాయి. పువ్వు మధ్యభాగంలో పడగ కింద ఒక లింగము ఉంటుంది. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే పత్రాలు పానుపట్టముగాను,మధ్య బొడిపి లింగముగాను, పైన కింజల్కఫణము సర్ప ఫణముగాను కనిపిస్తుంది.
నాగమల్లి చెట్టు గుణములు
ఆకు కొంచెం చేదుగాను, కారము గాను ఉంటుంది. పువ్వు కారము, వగరు కలగలసి ఉంటుంది. మొగ్గలో ఒకచోట కోసి నమిలినట్లయితే నాలుక మంటపుడుతుంది. ఇది ఉష్ణవీర్యద్రవ్యము. సాధారణంగా విషహరమునకు, చర్మవ్యాధులు తగ్గించడానికి ఈ చెట్టును ఉపయోగిస్తారు. ఆకుల రసము చర్మరోగాలకు వినియోగిస్తారు. నిమ్మకాయ రసముతో వేరును అరగదీసి రాసినట్లయితే చర్మరోగాలు హరిస్తాయి. నాగమల్లి వేరును నరమూత్రముతోగాని, తెల్లగరికవేరు రసముతో గాని, పసుపునీటితో గాని కలిపి తాగించినట్లయితే సర్పవిషము దిగుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో వివరించడం జరిగింది. కుట్టినచోట పైపూతగా కూడా వేరు రసమును రాయాలి.