సంస్కృతంలో స్నుహీ, కాండన్ను హీసమంధదుగ్ధా అని పిలిచే కాడచెముడు చెట్టును ఇంగ్లీషులో Neriifolia అని పిలుస్తారు. కాడచెముడు మొక్కకు ఆకులు, ముళ్ళు ఉండవు. చెట్టుమ్రాను గట్టిగా ఉంటుంది. చిలవ పలవ కాడలతో గుజ్జుగా పెరుగుతుంది. మూడు నుంచి నాలుగు గజాల వరకూ పెరుగుతుంది. చెట్టంతా తెల్లని పాలతో ఉంటుంది. పాలు ఒంటికి తగిలితే పొక్కుతుంది. కాడచెముడు కొమ్మను పాతినా బతుకుతుంది. దీనినే పుల్ల జెముడు అని కూడా అంటారు. దీని సర్వాంగములు ఉపయోగకరమైనవి.
కాడచెముడు గుణములు
కాడచెముడు కారపురుచి కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము. దారుణమైన వేడిచేసే స్వభావం కలిగి ఉంటుంది. తీక్ణ లఘుగుణ విశిష్టమైనది. విపాకమున కూడా కారపు రుచిగానే ఉంటుంది. వాత శ్లేష్మ దోషములను హరిస్తుంది. పైత్యమును, రక్తోద్రేకమును కలిగిస్తుంది. విరేచనము చేయడం దీని ప్రధాన గుణము. వమనకారి. దగ్గులను, శ్వాసరోగములను హరిస్తుంది. అసాధ్యమైన గుల్మములు, శూలలు హరిస్తుంది. దారుణమైన ఉబ్బులు,పాండురోగములు పోగొడుతుంది.
దగ్గులు,శూలలకు
కాడచెముడు కాడలు, చెట్టు చెక్క బాగా ఎండించి బాగా కాల్చిన బూడిద ఒక గురివిందగింజ ఎత్తు మొదలు మూడు గింజల ఎత్తు వరకూ తేనెతో ఇచ్చినట్లయితే శ్వాసకాసలు, ఉబ్బసములు కడతాయి. దీని కాడలు, పంచలవణములను కాడల రసముతోనే నూరి బిళ్ళలు చేసి ప్రమిదలలో పెట్టి శీల ఇచ్చి పుటము వేసినట్లయితే భస్మమవుతుంది. ఆ భస్మము ఒక అరకప్పు కొబ్బరినీళ్ళతో కాని, వేడినీళ్ళతో కాని కలిపి సేవించినట్లయితే దారుణమైన శూలలు కూడా తగ్గుతాయి.
పిల్లల గుల్మములలో విరేచనములకు
కాడచెముడు పాలు రెండు చుక్కలు, పంచదార, నెయ్యి, వెన్న వీటిలో దేనితోనైనా కలిపి సేవించినట్లయితే చక్కటి విరేచనము అయి గుల్మములు, యుదరములు తగ్గుతాయి.
పరిణామ శూలలకు
అరటిపండులో జెముడు కాడలను రెండింటిని దూర్చి దానికి ఎర్రమట్టితో శీల ఇచ్చి పుటము పెట్టవలెను. అది నలుపు, తెలుపు గల రంగులో భస్మమవుతుంది. ఆభస్మము తేనెతోగాని, నేతితో గాని సేవించినట్లయితే పరిణామ శూలలు, కొన్ని శ్వేత ప్రదరములు కూడా తగ్గుతాయి.
వాత నొప్పులకు
కాడచెముడు చెట్టు పాలను వాపులు, నొప్పులు ఉన్న ప్రదేశములో రాసి పైన పసుపు అంటించినట్లయితే వాపులు, నొప్పులు కూడా హరిస్తాయి. నాభి వద్ద నొప్పితో బాధపడుతుంటే ఈ కాడ పాలు పొడిచి పసుపు అద్దితే నొప్పి తగ్గుతుంది.
ఉబ్బులకు
దీనిపాలు నాలుగు రెట్లు, ఒక వంతు రసకర్పూరమును కలిపి ఒక పింగాణి గిన్నెలో వేసి మూడు మాసములు ఎండలో పెట్టి అంతరతామరాకు రసముతో నూరి కందిగింజలంత మాత్రలు కట్టి అవి ఒక కుండ పిడతలో పోసి వంటచేసే పొయ్యి కింద కప్పిపెట్టి ఒక మాసం అయిన తరువాత తీసి ఒక్కొక్కమాత్రను ఉదయం, సాయంత్రం నీళ్లతో గాని, తేనె గాని సేవించినట్లయితే దారుణములగు ఉబ్బులు తగ్గుతాయి.
అడ్డగఱ్ఱలకు
కాడచెముడు పాలు, కోడిగుడ్డులోని తెల్లసొన, రాసున్నము కలిపి మెత్తగా నూరి అడ్డగఱ్ఱ లేక బిళ్ళపై పట్టువేసినట్లయితే బిళ్ళ కరిగి తగ్గుతుంది. లేదా పగిలి బిళ్ళ హరిస్తుంది.
తామ్రభస్మము
కాడచెముడు మ్రానిలో తామ్రపుముక్కను పెట్టి ఆరుమాసాలు ఉంచి పిమ్మట తీసి పుటము వేసినట్లయితే తెల్లగా భస్మం అవుతుంది. ఈ తామ్రమును, తగరము కలిపి కరిగిస్తే వెండి అవుతుందని చెబుతారు.
గమనిక
కాడచెముడు పాలు తగినమోతాదులో కాకుండా ఎక్కువగా వినియోగించినట్లయితే ప్రమాదము. దీనికి విరుగుడు తంగేడు, నీరుల్లి.