కంచులోహము: సంస్కృతంలో కాస్య అనే పేరు కలిగిన కంచు మిశ్రమ లోహము. దీనిని ఇంగ్లీషులో Bell-Metal అంటారు. ఎనిమిది భాగాలు రాగి, రెండు భాగాలు తగరము కలిపి మరిగించినచో ఈ కంచు లోహం ఏర్పడుతుంది. కంచును మ్రోగించితే గణగణమని మ్రోగుతుంది. నునుపును కలిగి ఉంటుంది. కొంచెం పచ్చగా ఉంటుంది, తెలుపు కలిపిన రంగు కలిగి కాల్చినప్పుడు ఎర్రగా ఉండేదే శ్రేష్ఠమైన కంచు.
కంచు శుద్ధి
కంచును కొలిమిలో ఎర్రగా కాల్చి గోమూత్రములో ముంచినట్లయితే శుద్ధి అవుతుంది.
కంచు భస్మము
కంచు, గంధకము, తాళకముమూడు చేర్చి నూరి ఐదు పుటములు పెట్టినచో కంచు భస్మంగా మారుతుంది. కంచులో తామ్రవంగములు చేరి ఉండటంతో ఈ రెండు లోహముల యొక్కగుణములను కూడా కలిగి ఉంటుంది. ఈ భస్మమునే ఔషధంగా వినియోగిస్తారు.
కంచు గుణములు
చేదురుచిగా ఉంటుంది. ఉష్ణవీర్యము కలిగినది. లఘుగుణ విశిష్టము. లేఖనకారి. దృష్టికి మిక్కిలి హితమైనది. వాతపైత్యములను శమింపచేస్తుంది. క్రిములను, కుష్ఠురోగమును బోచేస్తుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. అయితే కంచుభస్మము సేవించేటప్పుడు నేతిని కలిపి తినకూడదు. అలా సేవించినట్లయతే దోషముకలిగిస్తుంది.
కంచు పాత్ర
కంచు పాత్రలో భోజనము శ్రేష్టము. మిక్కిలి ఆరోగ్యకరము. శుభప్రదము. శరీరములనకు చాలా హితమైనది. అయితే కంచుగిన్నెలో నెయ్యి పోసి నిలువ ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే విరుద్ధగుణంగా మారుతుంది. సరిగా భస్మము కాని కంచును సేవించినట్లయితే వివిధ రోగాలకు దారితీస్తుంది.