ఉచ్చింత తీగను సంస్కృతములో క్షుద్రబృహతి అని, Green Fruit of Solanum Trilobatum ఆంగ్లములోను పిలుస్తారు. ఉస్తి అని కూడా దీనికి మరో పేరు. డొంకలమీద ప్రాకుతుంది. ఆకులకు, తీగకు, తొడిమలకు కూడా చిన్న ముళ్ళు ఉంటాయి. ఆకు వాకుడు ఆకులాగ ఉంటుంది. కాని దానికంటె చిన్నది. కాయలు కాసరకాయల వలె ఉంటాయి. పచ్చికాయ పసిరికరంగు. పండు మాత్రం ఎర్రగా ఉంటుంది. కాయ నిండా చిన్న చిన్న గింజలు ఉంటాయి.
ఉచ్చింత గుణములు
ఉచ్చింత తీగలో సర్వాంగములు కూడా వైద్యమునకు ఉపయోగపడతాయి.
సర్వాంగములు కూడా చేదు రుచి కలిగి ఉంటాయి.
వేడిచేయు స్వభావము కలది. విపాకమున కారపు రుచిగా మారుతుంది.
ఉచ్చింతతో ఔషధములు
- ఉచ్చింత తీగ ఆకు, కాయలు కూడా శ్లేష్మవాతములు తగ్గించును.
- దగ్గులకు పెట్టిందిపేరు ఉచ్చింత.
- బాలింతరాలికి కూడా ఈ ఆకు కూర వండి పెడతారు. గర్భములోని వాతము హరించి వేడిచేస్తుంది.
- కాయల కూర గురుత్వము కలది. విరేచనము చేయును.
- వాకుడుకు కల గుణములు దీనికి కూడా ఉంటాయి.
- ఉచ్చింత పండ్లు ఎండబెట్టి గింజలతో కూడా చూర్ణము చేసి ఆ చూర్ణమును పెంకులో వేసి మాడ్చి ఆ మసి, పిప్పలిచూర్ణము సమానభాగాలుగా కలిపి తేనెతో పాటు ఇచ్చినట్లయితే పిల్లలకు వచ్చే అన్ని రకాల దగ్గులు కూడా శమిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో వివరింపబడి ఉంది.
- ఉచ్చింత వేరు కషాయముతో శ్లేష్మ దగ్గులు తగ్గుతాయి.
- కాయలు ఎండబెట్టి ఒరుగులు చేస్తారు. ఈ ఒరుగులు నూనెలో గాని, నేతిలో గాని వేయించి కారపు పొడి చల్లి తింటే అన్నమునకు మంచి ఆధరువుగా ఉండి దగ్గులను తగ్గిస్తుంది.