లవణ, కుండలీ అనే పేర్లు కూడా కలిగిన ఉప్పిచెట్టును ఆంగ్లములో Volkameria Inermis అని పిలుస్తారు. ముళ్ళజాతికి చెందిన ఉప్పిచెట్టు గజము ఎత్తు వరకూ పెరుగుతుంది. చెట్టుకాడకు, ఆకుల కొసలకు కూడా ముళ్ళు ఉంటాయి. ఆకు కొంచెం దళసరిగా రేగు ఆకంత ఉంటుంది. దీనిలో నల్ల యుప్పి, తెల్లయుప్పి అని రెండు రకాలు ఉంటాయి.
ఉప్పి చెట్టు గుణములు
- ఉప్పిచెట్టు చేదురుచిగా ఉంటుంది. మిక్కిలి వేడి చేస్తుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది.
- వాత ప్రకోపము వలన కలుగు దగ్గులు, ఉబ్బసములు ఉప్పిచెట్టు వేరు తేనెతో అరగదీసి నాకించితే తగ్గుతుంది.
- నల్ల ఉప్పి ఆకు రసములో మూడు గ్రాములు యవక్షారమును కలిపి సేవించిన వాతము వలన కలిగే ఉబ్బులు తగ్గుతాయి.
- ప్రసవించిన స్త్రీలకు మైల పోకుండా ఉన్నట్లయితే నల్లఉప్పి చిగుళ్ళు, మిరియము, సూతికాభరణముగాని, వాత విద్వంసి గాని కలిపి నూరి మాత్రలుగా కట్టి ఇచ్చినట్లయితే మైల రక్తమును జారీచేయుటయే కాక, మావిని కూడా వెడలిస్తుంది.
- బాలింతలకు సూతికా వాతములు రాకుండా కాపాడుతుంది.
- గర్భమునకు మిక్కిలి వేడిచేస్తుంది.
- శగ రోగములు కూడా కడుతుంది.
- నల్లయుప్పి వేరు, తుంగదుంపలు, చందినీయత్తరువు, రేవలచిన్ని, గంగరావితో శుద్ధిచేసిన సూరేకారము, చలవ మిరియాలు కలిపి నూరి కంది గింజలంత మాత్రలు కట్టి రోజుకు రెండుసార్లు ఇచ్చిన సెగలు నివారించును. ఈ మందు తీసుకునేవాళ్ళు ఉప్పు, పులుపు తినకూడదు. నల్లయుప్పి శ్రేష్ఠమైనది.