పాయిల: పావలి ఆకుతో పైల్స్ వ్యాధి మాయం

 

లోణా, ఘోలిక, లోణి అని సంస్కృతంలో పిలువబడే పాయిల తీగమొక్క. సన్నని తీగలు కలిగి నేలనంటి పాకుతుంది. దీనిని ఆంగ్లములో P.Quadrifida, Spinach అంటారు. సాధారణంగా మెట్టభూములో ఒక రకం, తేమగలభూములలో ఒక రకం పెరుగుతుంది. ఆకు చిన్నదిగా, పెళుసుగా ఉండి జిగురు కలిగి ఉంటుంది. పువ్వు  పసుపుపచ్చగా ఉంటుంది. దీనిలో చిన్నపాయిల, పెద్ద పాయిల అనేరెండు రకాలు ఉన్నాయి. అంతేకాకుండా పుల్లపాయిల, గంగపాయిల అనేరకాలుకూడా ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. ఇంచుమించు వీటి ఆకులు ఒకే విధంగా ఉంటాయి. ఇది గుల్మజాతికి చెందిన తీగ. కాండము కణుపుల వద్ద చిన్న నూగు ఉంటుంది. గ్రాహక పత్రములు నాలుగైదు ఉంటాయి. ఆకులు గుండ్రములు, కోలదనము కలిగి ఉంటాయి.  కింజల్కములు ఐదింటికి మించి ఉంటాయి. 

పెద్ద పావలి

ఈ పెద్ద పావలి మొక్క తేమ గలిగిన ప్రదేశాల్లో పెరుగుతుంది. దీనితో పులుసు, కూర తయారుచేసి తింటారు. పెద్ద పావలికి గింజలు కూడ ఉంటాయి. ఈ గింజలు, ఆకు కూడా మూత్ర విసర్జనలో వచ్చే మంటను తగ్గిస్తాయి. శగ రోగములలో వచ్చే మంటను కూడా తగ్గిస్తుంది. విపరీతమైన జ్వరాలు వచ్చినప్పుడు పెద్దపావలి మొక్కను ఐస్ కు బదులుగా ఉపయోగిస్తారు. పెద్దపావలి పులుపు రుచి కలిగి ఉంటుంది. కొంచెం ఉప్పు, కారము కూడా ఇందులో ఉంటాయి. ఇది వేడిచేసే స్వభావముతో ఉంటుంది. విపాకమున పులుపు రుచిగా మారుతుంది. గురు, రూక్ష, సరగుణములు కలవు. శ్లేష్మవాత దోషములను హరిస్తుంది. శ్వాసకాసలను, అగ్నిమాంద్యమును, మూలశంకలును, విషములను, గుల్మములను, వ్రణములను, జిహ్వాదోషములను పోగొడుతుంది. అతిసార రోగమును తగ్గిస్తుంది. నేత్రరోగములను అణుస్తుంది. ఆమ్లపైత్యమును, గ్రహణి, కుష్ఠు రోగములను శమింపచేస్తుంది. వీర్యక్షమును చేస్తుంది. 

ఔషధములు

మూత్రనిరోధ నివారణకు

పాయిల కూర, ఆదొండచెక్క ఆముదములో ఉడికించి వస్తికి కట్టినట్లయితే మూత్రబంధములు విడును.

రక్త వాంతులకు

ఉడకపెట్టిన పాయిలాకు నీళ్ళలో, ఆవుపాలు కలిపి త్రాగించినట్లయితే రక్తవాంతులు కడతాయి. 

రక్తమూలములు

పాయిలాకు, తమలపాకు, మదనానబకాయ ముక్కలు ఆముదముతో కలిపి ఉడికించి ఆ ముద్దను ఆసనమునకు కట్టినచో ఆసనపు పోటు, రక్తస్రావము హరిస్తుంది.

చలితమునకు

పాయిలకూర పుల్లమజ్జిగలో ఉడికించి ఆ ముద్దను ఒంటికి రాసి, అడ్డాకు పొగ వేసినచో చలితములు తగ్గుతాయి. అయితే ఇది తరచుగా వాడితే మూత్రాశయము పాడుచేస్తుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.