అంజన ధారణము : కళ్ళకు కాటుక పెట్టుకోవడాన్నే సంస్కృతంలో అంజన ధారణము అంటారు. కాటుకను ధరించడం వల్ల కళ్ళ చూపులకు తీక్షణత పెరుగుతుంది. నేత్రములకు నిర్మలత కలుగుతుంది. సకల నేత్రవ్యాధులను దూరం చేస్తుంది . వ్యాధులను దరిచేరనీకుండా చేస్తుంది.
అయితే ఈ కాటుక పరిశుభ్రమైన మసితో తయారైనదై ఉండాలి. ఈ కాటుక పొడిలో ఆవునెయ్యి కాని, నువ్వుల నూనె కాని కలిపి ధరించాలి.
ఈ కాటుకను మనమే తయారు చేసుకుంటే చాలా మంచిది. ఆముదముతో పెద్ద ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపానికి కొంచెం ఎడమగా ఉండేలా ఒక ఇత్తడి ప్లేటు గాని, పెద్ద గరిట గాని బోర్లించి ఆ దీపం మసిని దానికి అంటేలా చూడాలి. అలా ఆ దీపం ఉన్నంతవరకూ ఉంచాలి. అలా చేస్తే దానికి మసి అంటుతుంది. ఆ మసిని ఒక భరిణలోకి తీసి ఉంచుకుని దానిలో ఆవునెయ్యి గాని, నువ్వులనూనె కాని కలుపుకుని కళ్ళకు ధరిస్తే అలాంటి కాటుక కంటికి ఎంతో మంచిది.
కాటుకను ఈ సమయాల్లో ధరించకూడదు
రాత్రి అంతా మేలుకుని ఉన్నవారు, బాగా శ్రమ పడినవారు, వాంతులు అవుతున్నవారు, అప్పుడే తిన్నవారు, జ్వరము ఉన్నవారు, శిరస్నానము చేసిన వెంటనే కాటుక ధరించకూడదు అని వస్తుగుణప్రకాశిక గ్రంథములో పేర్కొనబడి ఉంది.