అడవి ఆముదపు చెట్టు: చిగుళ్ళను గట్టిపరిచే అడవి ఆముదం

 

అడవి ఆముద చెట్టునే సంస్కృతంలో కానన ఏరండ అని పిలుస్తారు. Jatroph, Curcas అని ఇంగ్లీషులో పిలుస్తారు. ఇది ఇంచుమించు అన్ని చోట్లా బంజరుభూముల్లో విశేషంగా పెరుగుతుంది. దక్షిణభారతదేశంలో ఈ చెట్లను పొలాలకు కంచెగా పెంచుతుంటారు. దీని ఆకులు, పసరు, గింజలు, చమురు, కాడలు, వేళ్ళు కూడా చికిత్సకు ఉపయోగిస్తారు.

అడవి ఆముదం గుణములు

  • అడవి ఆముదం మొక్క నుంచి తీసిన నూనెను పది నుంచి 20 చుక్కల వరకూ లోనికి పుచ్చుకుంటే ఒక ఔన్సు ఆముదం పుచ్చుకుంటే ఎన్ని విరోచనాలు అవుతాయో అన్ని అవుతాయి. కావున చాలా తక్కువగాను, అతి జాగ్రత్తగాను ఈ అడవి ఆముదాన్ని వాడాలి. 
  • ఈ చమురు దురదలు, గజ్జి, చిడుము, ఏనుగుగజ్జి, మొలగజ్జి, తామర పోగొడుతుంది. కురుపులు, గాయములు, పుండ్లు త్వరగా మాన్పుతుంది. 
  • అడవి ఆముదం మొక్క ఆకులు నిప్పుల మీద వెచ్చచేసి స్తనముల మీద వేసి కట్టి కొంచెం సేపు ఉంచినట్లయితే చనుబాలు వృద్ధి అవుతాయి. 
  • దీని ఆకులకు ఆముదం రాసి నిప్పులమీద వెచ్చచేసి వాటితో రుద్దినట్లయితే ప్రమేహపిటకలు, విద్రధులు పోతాయి.
  • అడవి ఆముదం కాడల నుండి వచ్చే జిగురువంటి ద్రవము పూసినట్లయితే గాయములు, వ్రణములు, నరుకులు మొదలైన వాటినుంచి స్రవించే రక్తము వెంటనే నిలిచిపోతుంది.  ఇదే జిగురు గజ్జి, చిడుము, ఏనుగుగజ్జి, తామర, మొలగజ్జి మున్నగు చర్మవ్యాధులకు మిక్కిలి మంచిమందు. 
  • దీని వేరుపట్ట ఆమవాతము పోగొడుతుంది. 
  • ఈపట్ట, కొంచెం ఇంగువ కలిపి నూరి లోపలికి మజ్జిగతో కొంచెం ఇచ్చినట్లయితే అగ్నిమాంద్యములు, అతిసారము తగ్గుతుంది. 
  • అప్పటికప్పుడు కోసిన అడవి ఆముదం కాడలతో పళ్ళుతోముకుంటే చిగుళ్ళు గట్టిపడతాయి. నోటి దుర్వాసన పోతుంది. పళ్ళ నుంచి రక్తము కారటం తగ్గుతుంది. దంతములు గట్టిపడి ఎప్పుడూ ఊడకుండా ఉంటాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.