వృక్షజాతికి చెందిన అగురు చెట్టు ఎక్కువగా అస్సాం ప్రాంతంలో అడవులలో కనిపిస్తుంది. చిలకసముద్రప్రాంత భూములలో కూడా ఈ అగురు చెట్లు పెరుగుతాయి. ఈ అగురునే ఇంగ్లీషులో Aquilaria agallocha, A.Ovata అని పిలుస్తారు. ఈ అగురు చెట్టు ఆకులు తొగర ఆకులాగ కోలగా ఉంటాయి. అగురులో అనేకజాతులు ఉన్నాయి. వీటిలో వైద్యానికి ముఖ్యంగా పనికి వచ్చేది కృష్ణాగురు.
అగురు గుణములు
అగురు ప్రధానమైన రుచి కారము. చేదు కూడా కొంచెం కలిసి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. వాత కఫములను రెండింటిని హరిస్తుంది. చెవిజబ్బులు, కంటిజబ్బులను పోగొడుతుంది. మంగళప్రదమైన ద్రవ్యము. కుష్ఠురోగములను హరింపచేయటంలో దీనికి మించినది లేదు. అగురు నిప్పులమీద వేసినట్లయితే సువాసన వెదజల్లుతుంది. చర్మమునకు కాంతి ఇస్తుంది. చర్మవ్యాధులను పోగొడుతుంది. అగరువత్తులను, బిళ్ళలను చేస్తారు. ఈ బిళ్ళలను అరగదీసి ఒంటికి రాసుకుంటే సువాసన కలిగి బలమును, ఉత్సాహమును పుట్టిస్తుంది.
అగరులోని వివిధ జాతులకు గుణములు సమానమే. ఈ అగరు గింజల నుండి నూనె తీస్తారు.
ఔషధములు
ఎక్కిళ్ళకు
కృష్ణాగురు చూర్ణమును తేనెతో కలిపి నాకినట్లయితే ఎక్కిళ్ళు ఉపశమిస్తాయి.
ఉప్పుమేహము
చిరుబొద్ది, అగురు కషాయము పెట్టి త్రాగినట్లయితే ఉప్పుమేహము ఉపశమిస్తుంది.
తామర, కుష్ఠులకు
అగురునూనె, మోదుగమాడలోని చమురు కలిపి పైన వ్రాసినట్లయితే తామర, కుష్ఠు పోతాయి. నరములకు బలమును కూడా కలుగచేస్తుంది.
శ్వాసరోగము
పిల్లలకు ఊపిరితిత్తులలో కలిగే శ్వాసరోగములకు అగరు చమురు బ్రాందీలో కలిపి రాసినట్లయితే శ్లేష్మము కరిగి తీవ్రత తగ్గుతుంది. విపరీతమైన తలనొప్పులకు ఈ చమురును తలకు వ్రాసినట్లయితే ఉపశమనం కలుగుతుంద.
అగురునూనె
ఆదికాలం నుండీ మనదేశంలో వాడుకలో ఉన్న తలనూనెలలో ఇది ఒకటి. కృష్ణాగురు చెక్కతో తయారుచేయుదురు. ఇది సువాసనగా ఉంటుంది. వేడిచేస్తుంది. శ్లేష్మము, వాతము , కృములు, కుష్ఠు, రక్తపిత్తము నివారిస్తుంది. కొవ్వు తగ్గిస్తుంది. కురుపులు మాన్పుతుంది. ముఖ్యంగా కళ్ళమంటలు, తలపోట్లు, తలతిప్పు తగ్గిస్తుంది. చుండ్రు పోగొడుతుంది. వెంట్రుకలను నల్లబరచి గుబురుగా పెంచి రాలిపోనివ్వదు. వెంట్రుకలు తెల్లబడకుండా కూడా చేస్తుంది.
అగరువత్తులు
అగరువత్తులు అగరుతోనూ, పునుగుతోనూ, అంబరుతోను, జవ్వాజితోనూ, కస్తూరితోను తయారుచేస్తారు. శుభకార్యాలలోను, సభలలోనూ, బెడ్ రూమ్స్ లోను సువాసనభరితంగా ఉండటానికి, శుభానికి వీటిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ అగరువత్తుల పొగతోవాతావరణం సురభళమై దుర్వాసన పోతుంది. కృములు అంతరిస్తాయి. దోమలు తగ్గుతాయి. మనస్సునకు ఉల్లాసము, హృదయమునకు ఆనందము కలుగుతుంది.