చెరుకును సంస్కృతంలో ఇక్షు అని పిలుస్తారు. ఆంగ్లములో Sacoharum Ficinarum అంటారు. ఈ చెరుకులో పలురకాలు ఉంటాయి. రెండు నిలువుల ఎత్తు వరకూ ఈ చెట్టు పెరుగుతుంది. ఆకులు మూడు నుంచి నాలుగు అంగుళాల వెడల్పు కలిగి, గరుకుదనముతో ఉంటాయి. చెరకునకు పది పదిహేను కణుపుల వరకూ పెరుగుతుంది. ప్రతీ కణుపుకు రెండేసి ఆకులు ఉంటాయి. ఈ చెరుకుకు పువ్వులు, కాయలు ఉండవు. ముదిరిన తరువాత రెల్లు వెన్ను వంటి వెన్ను మాత్రం వస్తుంది. లేత దవ్వనే ముక్కలుగా నరికి పాతుతారు. ఇదియే విత్తనము. రసమునుండి బెల్లము, పంచదార తయారు చేస్తారు.
చెరుకు గుణములు
చెరుకురసము మధురరసము కలది. శీతవీర్యము, గురుగుణము. విరేచనకారి. కఫమును కలిగించును. మూత్రమును జారీచేస్తుంది. వీర్యవృద్ధిని కలిగిస్తుంది. వాతహరమైనది. భోజనం అయిన వెంటనే చెరుకురసం తాగినట్లయితే వాతము చేస్తుంది. చెరుకును మూడు భాగాలుగా విభజించాలి. మొదటిభాగం మిక్కిలి మధురమైనదిగాను, మధ్యభాగము సమ మాధుర్యమును, దవ్వగల కొనభాగం ఉప్పు రుచి కలిగినది గాను ఉంటుంది. వాత రక్తమును, పైత్యమును శమింపచేస్తుంది. మూత్రశుద్ధిని చేస్తుంది. ఇంద్రియములకు తృప్తినిస్తుంది. మేదోవృద్ధికరమైనది. చెరుకులలో బంగారుతీగ రకం శ్రేష్ఠమైనది. గానుగల నుండి ఆడి తీసిన రసము మలబద్ధమును చేస్తుంది. గురుత్వముగా ఉంటుంది. విదాహకరమైనది. చెరకు కర్రను దంతములచే నమిలి మింగినట్లయితే రసము పంచదారతో సమానమైన గుణము కలిగి ఉంటుంది. ఇంచుమించు చెరుకు రసములు అన్నింటికీ ఒకేరకమైన గుణములు ఉంటాయి. అడవి చెరుకుకు కూడా ఇవే గుణములు ఉంటాయి. చెరుకు రసమును కాచగా తేలిన పానకమును ఫాణితము అంటారు. ఇది మిక్కిలి శ్లేష్మము చేస్తుంది. మిక్కిలి గురుత్వము కలది. వీర్యమును పెంచుతుంది. వాత పిత్తహరము, మూత్రమును, వస్తిని శోధిస్తుంది.
సంస్కృతంలో శ్వేతేక్షుఅంటారు. రుచి పుట్టిస్తుంది. మలబంధము, మూత్ర నిరోధము తగ్గిస్తుంది. రక్తపిత్తము, మూత్రాఘాతము, మూత్రకృచ్ఛము, మూత్రాశ్మరి, కఫప్రకోపము, వాతవికారములు, హరిస్తాయి. మూత్రాశ్మరి, కఫప్రకోపము, వాత వికారములు హరిస్తుంది. బలము, పుష్టి, వీర్యవృద్ధి కలిగిస్తుంది. కళ్ళకు మేలుచేస్తుంది.
నల్ల చెరుకు
సంస్కృతంలో శ్యామలేక్షు, కోకిలేక్షు అని పిలుస్తారు. ఇది బలము, వీర్యవృద్ధి కలిగించును. తాపము, శోష పోగొడుతుంది. వ్రణములు వృద్ధిచేస్తుంది.
మూత్రకృచ్ఛమునకు
చెరుకురసమును తాగినట్లయితే మూత్రము జారీ అయి మూత్రకృచ్ఛ్రములు తగ్గుతాయి.
గ్రహణికి
అప్పుడే పిండిన చెరుకురసమును తాగించినట్లయితే గ్రహణి తగ్గుతుంది. నిలువచేసిన రసము పనికిరాదు.
ముక్కునుండి రక్తము కారుటకు
చెరుకురసము పది చుక్కలు ముక్కులో వేసి పీల్చినట్లయితే రక్తస్రావము కడుతుంది.
పాండురోగమునకు
చెరుకురసము, ఉసిరిపళ్ళరసము, తేనె కలిపి తాగినట్లయితే పాండురోగము తగ్గుతుంది.
క్షతకాసలు
చెరుకురసములో ఆవునెయ్యి వేసి కాచి దానిని సేవించినట్లయితే క్షతకాసలు తగ్గుతాయి.
అగ్నివిసర్పులకు
చెరుకురసమును పైన స్ప్రేచేసినట్లయితే అగ్నివిసర్పులు తగ్గుతాయి.
చెరుకును ఎవరు తినకూడదు?
అగ్నిమాంద్యము, మేహవ్యాధులు, కుష్ఠరోగములు, పీనస, కఫము, గుల్మము, క్రిమి ఉబ్బు, జ్వరము, భగందరము, కాస ఈ రోగములు ఉన్నవారు చెరుకురసమును త్రాగకూడదు.