దురాలభా, యాన అనే పేర్లు కూడా కలిగిన చిన్న దూలగొండలో రెండు రకాలు ఉంటాయి.మొదటిది Alhage Camelorum, రెండవది Alhagi Manrorum. వీటిలో తెలుపు, ఎరుపు అనేవి రెండు జాతులు. ఆకు, వేరు తెల్లగా ఉండేవి తెల్లజాతులు. ఆకు, వేరు ఎర్రగా కనిపించేది ఎర్రజాతులు. రెండింటికీ ఒకే రకమైన గుణములు ఉంటాయి. ఈ మొక్క సుమారు అరమీటరు ఎత్తు వరకూ పెరుగుతుంది.
చిన్న దూలగొండ గుణములు
చిన్న దూలగొండ మొక్క వేరు తప్ప మిగిలిన ఏ భాగము శరీరానికి తగిలినా శరీరముబొబ్బలెక్కి విపరీతమైన దురద పుడుతుంది. చెట్టంతా పదునైన నూగు కలిగి ఉంటుంది. ఆకులు మూడు దళాలు కలిగి చిన్నవిగా ఉంటాయి. కాయలు నూగు కలిగి ఇండుపగింజలంత పరిమాణంలో ఉంటాయి. వేరు సన్నంగా, పొడవుగా ఉంటుంది. చవిటి భూములలో విస్తారముగా పెరుగుతుంది. వేరుకే విస్తారమైన గుణము ఉంటుంది. మేకలు, ఒంటెలు, గాడిదలు తింటాయి.
చిన్న దూలగొండ ఔషధములు
చేదు, తీపి, వగరు కలిగిన రుచి. శీతవీర్యము. విపాకమున కారపురుచిగా మారుతుంది. విషజ్వరములను, దప్పిని, తాపమును, వాంతిని , మేహవ్యాధులను అణుస్తుంది. రక్తపిత్తమును హరిస్తుంది.
రక్తపైత్యమునకు
వేరు, మంచిగంధము కలిపి కషాయము పెట్టి లోనికి పుచ్చుకున్నట్లయితే రక్తపిత్తము శమించును.
ముక్కునుంచి రక్తంకారుట
చిన్న దూలగొండ వేరును చనుబాలతో నూరి పిండి వడగట్టి ఆ రసము సస్యము చేయించినట్లయితే రక్తస్రావముకడుతుంది.
కఫవాంతులకు
దూలగొండి వేరు చూర్ణము తేనెతో కలిపి ఇచ్చినట్లయితే కఫవాంతులు తగ్గుతాయి.
మూత్ర ఘాతమునకు
దూలగొండి వేరు స్వరసము లేక కషాయము లోనికి ఇచ్చినట్లయితే మూత్రాఘాతము తగ్గుతుంది.
భ్రమకు
వేరు కషాయము నేతితో కలిపి త్రాగినట్లయితే భ్రమ (ఒళ్ళు తూలడం) తగ్గుతుంది.
ఇది స్త్రీలకు వంధ్యత్వము పోగొట్టి సంతానమును కలిగిస్తుంది. పురుషులకు వీర్యవృద్ధి కలిగిస్తుంది.