అతి వస మొక్కనే అతి విషా అని సంస్కృతంలోను, Aconitum heterophyllum అని ఆంగ్లములోను పిలుస్తారు. ఈ మొక్క దుంపనే వైద్యములకు ఉపయోగిస్తారు. ఇది మొక్క జాతిలోనిది. చేదు, కారము కలగలిసి ఉంటుంది. వేడిచేస్తుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. శ్వేతకందా, దుంప తెల్లగా ఉంటుంది. భంగురా, గంటులు ఉంటాయి. దీనినే పిల్లలమంద అని కూడా పిలుస్తారు. గుణమును బట్టి అతిసారఘ్ని అనే పేరు కూడా ఉంది. కఫమును, పైత్యమును, వాంతిని, క్రిములను హరించును. జిగట విరేచనములు కడతాయి. ఆకు రసము వాత నొప్పులను, మేహములను శమింపచేయును. పశువులకు వచ్చే రోగములు నివర్తించును.
ఆమ విరేచనములకు
అతివిష, శొంఠి కషాయము పెట్టి ఇచ్చినట్లయితే విరేచనములు కడతాయి. అగ్నిదీప్తిని కలిగిస్తుంది.
ఉదర రోగములకు
మూడు భాగములు ఊడుగవేరు, ఒక భాగము అతివిష, బియ్యపు కడుగుతో కలిపి ఇచ్చిన కుక్షిరోగములన్నీ శమిస్తాయి.
పిల్లల జ్వరము, దగ్గు, పైత్యము, విరేచనములకు
అతివస ఒక భాగము, తుంగ దుంపలు ఒక భాగము, పిప్పళ్ళు ఒక భాగము, కర్కాటశృంగి ఒక భాగము నాలుగూ మెత్తగా చూర్ణము చేసి మూడు లేక నాలుగు గురివిందగింజల ఎత్తు చూర్ణము తేనెతో కలిపి ఇచ్చినట్లయితే పై జబ్బులన్నీ తగ్గుతాయి. దీనినే బాలచాతుర్భద్రిక అంటారు.