అతి మధురముతో అనేక వ్యాధులు మాయం

అతిమధురము అని పిలిచే ఈ గుల్మజాతి మొక్కలో రెండు రకాలు ఉంటాయి. ఈ అతిమధురమునే మధుయష్ఠి అని సంస్కృతంలో పిలుస్తారు. Glycyrrhiza glabra అని ఆంగ్లములో దీనికి పేరు. దీనినే యష్ఠిమధుర అని కూడా పిలుస్తారు. నీటి ప్రదేశాలలోను, మెట్ట ప్రదేశాలలోను కూడా ఈ అతిమధురము పెరుగుతుంది. నిలువెత్తు పెరిగే ఈ చెట్టు ఆకరులు మరువము ఆకుల వలె ఉంటాయి. గుండ్రముగా, దళసరిగా ఉండి, అతిమధురము కొమ్మలు, ఆకులు కూడా నార కలిగి ఉంటాయి. పువ్వులు తెల్లగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి.

అతి మధురము గుణములు

అతిమధురము యోగసిద్ధిని కలుగచేస్తుంది. చలువచేసే గుణము. ఎక్కువతీపి, కొంచెం కారము కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. నాలుకపై వేసుకుంటే చిమచిమ లాడి నీరు ఊరిస్తుంది. విపాకమున తీపి రుచియే ఉంటుంది. నేత్ర రోగములకు చాలా మంచిది. తలవెంట్రుకలను పొడవుగా పెంచుతుంది. నల్లపరుస్తుంది. దప్పిక ఎక్కువగా ఉండి నోరు ఆర్చుకుపోయినప్పుడు దీని వేరు ముక్క చప్పరించినట్లయితే చమ కలిగించి దప్పిని తగ్గిస్తుంది. విషమును హరిస్తుంది. పైత్యములను, వాంతిని నివారిస్తుంది. క్షయ రోగమును పోగొడుతుంది. వీర్యము వృద్ధినొందిస్తుంది. వ్రణములలో ఉండు కుళ్ళును శోధించి మాన్పుతుంది. శెగ రోగములకు కూడా ఇది చాలా మంచిది. రసాయన ద్రవ్యము. 

రసాయనమునకు

యష్టి మధుకముయొక్క చూర్ణము పాలతో కలిపి త్రాగిన, ముసలితనమును, రోగములను రాకుండా చేసి చాలాకాలము బ్రతుకునట్లు చేస్తుంది. 

క్షత క్షీణమునకు

క్షత క్షీణమనగా గుండెలో ఉండు అవయవములకు అయినను, ఇతర మర్మావయవములకు అయినను దెబ్బ తగిలినచో నోటివెంబడి రక్తము పడుతూ మనిషి క్షీణించును. అలాంటి రోగములకు శొంఠి, యష్టి మధుకములను కషాయముగా పెట్టి పాలు కలిపి తాగినా లేక వీటి చూర్ణము పాలతో కలిపి త్రాగించినా క్షతక్షీణము హరిస్తుందని వస్తుగుణప్రకాశిక గ్రంథములో తెలుపబడినది. 

హృద్రోగమునకు

యష్ఠిమధుకము, కటుకరోహిణి యొక్క నూరిన ముద్దను పంచదార నీళ్ళతో కలిపి తాగినట్లయితే హృదయరోగములు నివారింపబడతాయి. ఈ ఔషధ వివరణ చరక గ్రంథములో తెలుపబడినది. 

గర్భరోగములు

గర్భిణి గాని, గర్భములోని శిశువుగాని ఎదగకుండా శుష్కించిపోయి గర్భము ఎదగక పోవడం వంటి వాటికి  పాలతో పంచదార, నేలగుమ్మిడి, యష్టి మధుకము రసములను కలిపి త్రాగించినట్లయితే శుష్కించిన గర్భము ఎదిగి వృద్ధినొందుతుంది. 

వాత రక్తమునకు

వాతరక్తమనగా వాతము ప్రకోపించి, రక్తమును కలుషితం చేసి అరికాళ్ళలోను, అరిచేతులలోను నల్లటి మచ్చలు వెలువడి తిమ్మిరి, పోట్లు కలుగుతాయి. దీనినే వాతరక్తము అంటారు. దీనిని నివారించాలంటే యష్టిమధుకము, నేలగుమ్మడబి కలిపి కషాయము పెట్టి త్రాగించాలి. 

పాండు రోగమునకు

యష్టిమధుకము యొక్క చూర్ణముగాని, కషాయము గాని తేనెతో కలిపి త్రాగించినట్లయితే పాండురోగము నివారణ అవుతుందని సుశ్రుతము గ్రంథములో తెలియచేయబడింది.

రక్తవాంతికి

యష్టిమధుకమును, మంచిగంధమును, పాలతో మెత్తగా నూరి ఆ ముద్ద పాలలో కలిపి త్రాగించినట్లయితే రక్తవాంతులు తగ్గుతాయి. 

అంగమునుండి కాని, ఆసనము నుండి కాని రక్తము పడుతూ ఉంటే యష్టిమధుకము తేనె కలిపి నాకించినట్లయితే ఉపశమిస్తుంది. 

నరుకు దెబ్బలకు

యష్టిమధుకము యొక్క కషాయముతో దెబ్బను కడిగి, వేడి నేతితో దీని చూర్ణము మెత్తగా ఉడికించి దెబ్బపై కట్టినట్లయితే నరకు దెబ్బలు క్రమేణా  తగ్గుతాయి. 

ఉదావర్త, మూత్ర బంధనములకు

ద్రాక్షపండ్లు, యష్టిమధుకము చూర్ణము పాలతో కలిపి త్రాగినట్లయితే వాతము క్రిందుగా ప్రసరించి మూత్రమును సాఫీగా జారీచేస్తుంది. 

శిరోరోగములకు

నాలుగు గుఱివిందగింజల ఎత్తు యష్టిమధుకము చూర్ణము, ఒక గింజ ఎత్తు నాభి చూర్ణము మెత్తగా కాటుకలాగా నూరి దానిలో ఆవగింజంత ప్రమాణము కలిగిన చూర్ణము ముక్కు రంధ్రములో ఉంచినట్లయితే సర్వ శిరోరోగములు నశిస్తాయి అని భావప్రకాశిక గ్రంథంలో తెలుపబడినది. 

నవీనవైద్యము

యష్టి మధుకము నమిలినట్లయితే నోట్లో లాలాజలం పుడుతుంది. గొంతులో ఎండి చిక్కుకొనిన శ్లేష్మము కరిగి ద్రవిస్తుంది. It stimulates the mucus membrane. అంతేకాకుండా ఊపిరాడని శ్వాసరోగమునకు మార్గమును మెత్తబరిచి దారిని కలిగిస్తుంది. బొంగురుగొంతుక, పొడిదగ్గు, ఆస్త్మా తదితర శ్వాసశ్లేష్మ రోగములను నివారించడంలో యష్టిమధుకము విశేషంగా పనిచేస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.