స్వర్ణ కార్పాసి, రక్తకార్పాసి అనే పేర్లు కలిగిన పైడిప్రత్తి చెట్టును ఇంగ్లీషులో Indian Cotton Plant, Bearing Red flower అని పిలుస్తారు. ఈ చెట్టు భారతదేశం అంతా కనిపిస్తుంది. మూడు గజాల ఎత్తు వరకూ ఈ చెట్టు పెరుగుతుంది. ఆకు అరచేతిలాగా ఉంటుంది. పువ్వు శంఖాకారములో ఉంటుంది. కాయ వత్తు ‘ధ’ ఆకృతిలో ఉంటుంది. కాయలు బాగా పండితే పగులుతాయి. గింజలు పసుపు, ఆకుపచ్చ కలిసిన రంగులో ఉంటాయి. దీనిలో సర్వాంగములు మిక్కిలి ఉపయోగకరములు. ప్రత్తి మిక్కిలి జిగి కలిగి వత్తులు తయారు చేసి దీపారాధనకు శ్రేష్ఠమైనది. జంధ్యములు కూడా తయారు చేస్తారు.
పైడిప్రత్తి గుణములు
పైడిప్రత్తి గింజలు తీపిరుచి కలిగినవి. వేడిచేస్తాయి. విపాకమున తీపిరుచిగా ఉంటాయి. లఘుగుణము కలిగి ఉంటాయి. ప్రత్తి సర్వావయవములు వాతమును హరించే గుణము కలిగి ఉంటాయి. గింజలు, పప్పు పైత్య శమనము కలిగిస్తాయి. పువ్వు రసాయనద్రవ్యము. ఈ చెట్టు జంతువిషములు అన్నింటినీ హరిస్తుంది. పైడిప్రత్తి తో బంగారు, వెండి లోహములు భస్మమవుతాయి. ఇది పాషాణములకు విరుగుడుగా పనిచేస్తుంది.
ప్రత్తిగింజల పానీయము
భమిడిప్రత్తి గింజలు రెండు గ్రాములు(తులములు), ధనియాలు నాలుగు తులములు, తంగేడుపువ్వులు ఎనిమిది తులాలు ఇవన్నీ దోరగా వేయించి పొడిగా చేసి ఆ చూర్ణము కషాయముగా కాచి ఆ కషాయమును తేర్చి దానిలో పాలు, పంచదార కలిపి సేవించినట్లయితే మిక్కిలి మేహశాంతి, వీర్యవృద్ధి, బలము కలుగుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో పేర్కొనబడి ఉంది.
వాంతులు, ఎక్కిళ్ళు తగ్గడానికి
ప్రత్తిగింజల పప్పు, కాకిదొండ గింజల చూర్ణము, ఏలకుల చూర్ణము, తెల్లపట్టుగుడ్డ మసి, నెమలిఈకల మసి ఇవన్నీ సమభాగాలుగా కలిపి పూటకు ఒక అణా ఎత్తు చూర్ణమును తేనెతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే అసాధ్యమైన వాంతులు, ఎక్కిళ్ళు కడతాయి. ఈ చూర్ణమునే కర్పాసాది చూర్ణము అని పిలుస్తారు.
స్తన్య వృద్ధికి
భమిడిప్రత్తి గింజల చూర్ణము పాలతో కలిపి త్రాగినట్లయితే బాలింతలకు స్తన్యము వృద్ధి అవుతుంది.
ప్రదరములకు
భమిడిప్రత్తి చెట్టు పువ్వు కషాయము, అభ్రకభస్మము కలిపి సేవించినట్లయితే ఎర్రకుసుమలు కడతాయి.
గ్రహణులకు
ప్రత్తిపువ్వు, దాల్చినచెక్క కషాయము లోనికి పుచ్చుకున్నట్లయితే గ్రహణులు తగ్గుతాయి.
నాడీ వ్రణములకు
ప్రత్తి వేరు, పసుపు కలిపి నూరి, నీటిలో వేసి అందులో తైలము కలిపి తైలము మాత్రమే మిగిలేలా మరిగించాలి. చల్లార్చి ఉంచిన ఈతైలమును చెవినిండా వేసినట్లయితే నాడీవ్రణములు తక్షణమే తగ్గుతాయి.