కదంబము, నీప ధారా కదంబము అనే పేర్లు కూడా కలిగిన ఈ కమిడి చెట్టులో చాలారకాలు ఉన్నాయి. కదంబము, ధారా కదంబము, భూమి కదంబము, రాజకదంబము, ధూలి కదంబము. వీటిలో రాజ కదంబము పెద్ద వృక్షము. ఈ కమిడి చెట్టు శాస్త్రీయ నామం Anthocephalus Cadamba, Wild Cinehona, Adina Cordirolia.
కమిడి చెట్టు ఆకులు జీడిమామిడి చెట్టు ఆకులవలె వలె ఉంటాయి. ఆకులు చాలా గుజ్జువలె ఉంటాయి. మాను చెక్కచాలా దళసరిగా ఉంటుంది. చెట్టుకు సన్నని ఊడలవంటి కాడలు ఉంటాయి. పువ్వు మంచి సువాసన కలిగి ఉంటుంది. వర్షాకాలములో పూస్తాయి.
ధూళి కదంబము పువ్వులు పోక చెట్టు పువ్వుల వలెఉంటాయి. వసంత ఋతువులో పూస్తాయి. భూమి కదంబము చాలా చిన్న చెట్టు.ఆకులు, పువ్వులు కూడా చిన్నవిగా ఉంటాయి. పువ్వుకు సువాసన ఉంటుంది. మొత్తానికి కొంచెం భేదముతో రూపములో అన్నీ సమానముగానే ఉంటాయి.
కమిడి చెట్టు గుణములు
కమిడి చెట్టు వగరు రుచి గలిగి ఉంటుంది. శీతవీర్యము గల ద్రవ్యము. గురుగుణము కలది. స్పర్శలో కూడా రసము చల్లగా ఉంటుంది. వ్రణములను పోగొట్టడంలో దీనికి మించినది లేదు. విషహర ద్రవ్యము. తాపమును తగ్గించును. దగ్గును నివారించును. ఒక్క పులుపురుచి తప్ప మిగిలిన ఐదు రుచులూ కమిడి చెట్టుకు ఉన్నట్లు గ్రంథంలో వివరింపబడి ఉంది. వాతమును హరించును. కఫ, పిత్తములను కూడా హరించును. మిక్కిలి వీర్యవృద్ధిని చేస్తుంది. శరీరమునకు మంచి కాంతిని కలిగించును. విషము ఎక్కుటవలన కలిగిన వాపులను హరించును. చనుబాలను వృద్ధిచేయును. యోని దోషములు, రక్త వికారములను పోగొడుతుంది. కమిడి చిగురు వగరు రుచి, శీతవీర్యము, విపాకమున తీపి రుచి కలిగి ఉంటుంది. అతిసారమును, రక్తపైత్యమును తగ్గిస్తుంది. కాయలు శ్లేష్మమును కలిగిస్తాయి. వేడి చేస్తాయి. వీర్యవృద్ధి, బలకరము. పండు త్రిదోషహరము. అత్యుత్తమమైనది. మిగిలిన గుణములన్ని జాతులకు సమానములు.
ఔషధములు
వ్రణములపై కట్టుటకు
వ్రణములపైన వేసి కట్టుటకు కమిడి ఆకులు మిక్కిలి శ్రేష్ఠమైనవి. ఆకులకు వ్రణములను మాన్పు గుణమే కాక గాలిలో ఉండే క్రిములను వ్రణములో చేరకుండా కాపాడు గుణము కూడా కలదు.
మూత్ర కృచ్ఛమునకు
కమిడి చెక్క, నేలగుమ్ముడు కలిపి కషాయము పెట్టి ఆ కషాయములో ఆవునెయ్యి వేసి నెయ్యి మిగిలేలా విరగగాచి ఆ నెయ్యిని సేవించినట్లయితే మూత్రకృఛ్రములు, మూత్ర దోషములు, మూత్రపు రంగు మారుటయు పోవును.
ఆధునిక వైద్య కమతమునకు
ధారా కదంబమునకే కేళీకదంబము అనే పేరు కూడా ఉంది. పట్ట చేదురుచి కలిగి ఉంటుంది. మిక్కిలి బలమును కలిగించును. జ్వరమును హరించును. అజీర్ణ, గ్రహిణి, అగ్నిమాంద్యముల యందు హితకరమైనది. దీని శాస్త్రీయనామం India metiria medika.
ధారాకదంబము రసములో జీలకర్ర చూర్ణము కలిపి ఇచ్చిన పిల్లలకు వచ్చు వాంతులు హరించును. పళ్ళు చల్లదనము కలవై శ్రమను తగ్గించును. జ్వరము వచ్చిన సమయములో వచ్చిన అతి దాహమునకు ధారా కదంబము ఫల రసమును పట్టించినట్లయితే శమిస్తుంది. దీని శాస్త్రీయనామం metiria medika of India.