ఉలిమిడి చెట్టుతో అనేక రోగములు మాయం

రుణ, అశ్మరిఘ్న అని సంస్కృతంలో పేరు కలిగిన ఉలిమిడి చెట్టు శాస్త్రీయనామం Cappari Trifoliata Crataeva Religiosa and Crataeva Inurvala. ఇది పెద్ద వృక్షజాతిలోనిది. ఆకులు మారేడు ఆకులను పోలి ఉంటాయి. కాయలు కూడా మారేడుకాయలు వలె ఉంటాయి. పువ్వులు తంగేడు పువ్వుల వలె గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గింజలు పోక కాయలలోని గింజలను పోలి ఉంటాయి. కాయ పండినట్లయితే ఎర్రగా ఉంటుంది. చేదు గల ఆకు, తెల్లటి పుష్పాలు కలిగి ఉంటుంది. చెట్టు మాను తెల్లగా ఉంటుంది. వాతమును పోగొడుతుంది. అశ్మరీ రోగములను హరిస్తుంది.

గుణములు

వగరు, తీపి, చేదు కలిసిన రుచి కలిగి ఉంటుంది. వేడిచేస్తుంది. విపాకమున కారపు రుచి కలిగి ఉంటుంది. లఘు రూక్షగుణములు దీని స్వభావ గుణములు. విరేచనము చేయును. విద్రధులను, మూత్ర కృచ్ఛములను పోగొడుతుంది. వాత రక్త వ్యాధిని, గుల్మములను, రక్తపోటును, క్రములను హరిస్తుంది. రక్త దోషములన్నింటినీ శమింపచేస్తుంది. శిరోవాతములను, హృద్రోగములను నశింపచేస్తుంది.

ఉలిమిడి పువ్వు మలబద్ధమును చేస్తుంది. పైత్యమును తగ్గిస్తుంది. ఆమవాతమును బోచేస్తుంది. ఉలిమిడి పండు విరోచనము చేస్తుంది. విపాకమున తీపి రుచిగా మారుతుంది. పిత్తమును, వాతమును కూడా శమింపచేస్తుంది. 

ఔషధములు

మూలశంకలకు

సలుపు, పోటు గల మూలశంక రోగులు ఉలిమిడి ఆకులను పెద్ద బానలో నీరు వేసి అందులో మరిగించి ఆ నీటిని ఒక తొట్టిలో పోయాలి.  ఆసనమునకు, ఒళ్ళంతా నూనె రాసుకుని  ఆ తొట్టిలోని నీటిలో స్నానము చేయాలి. అలా చేస్తూ ఉంటే బాధలు ఉపశమించి మూలవ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథము తెలియచేస్తోంది.  

అశ్మరీ రోగములకు

ఉలిమిడి యొక్క వేరు చెక్క మెత్తగా నలగగొట్టి కషాయముగా కాచి వడగట్టి సేవించినట్లయితే అశ్మరీ రోగములు పోతాయి. 

గండమాలలకు

ఉలిమిడి వేరు చెక్క కషాయములో తేనె కలిపి ప్రతిదినమూ సేవిస్తూ ఉంటే చాలా కాలము నుంచీ ఉన్న గండమాలలు కూడా హరించును.

విద్రధులకు

తెల్ల గలిజేరు వేరు, ఉలిమిడి వేరు కలిపి కొట్టి కషాయము పెట్టి సేవించినట్లయితే పక్వముకాని విద్రధులు(సెగ్గడ్డలు) కూడా పక్వమై మానుపడతాయి. 

ముఖములో మొటిమలకు

ఉలిమిడి చెక్క మేకపాలతో నూరి ముఖమునకు గంధమువలె పూసినట్లయితే వ్యంగరోగము శమిస్తుంది. 

వాతనొప్పులకు

ఉలిమిడి వేరు, మునగచెక్క మెత్తగా నూరి కడుగులో కలిపి బాగుగా కాచి పైన రాసిన వాత నొప్పులు హరిస్తాయి. దీని ఆకులు ఆముదముతో వెచ్చచేసి కట్టినట్లయితే వాత వ్యాధులు హరిస్తాయి. ఎక్కువసేపు ఒంటిపై ఉంటే కొంచెం పొక్కే గుణము ఉంటుంది. ఉలిమిడికి నిద్రపట్టించే గుణము కలదు. 


 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.